యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘వారణాసి’. సూపర్ స్టార్ హీరోగా దర్శక ధీరుడు ఎస్.ఎస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఆ విధంగానే నిన్నటి నుంచి ‘వారణాసి’ హ్యాష్ ట్యాగ్ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం వచ్చే ఏడాది ఇదే సమయానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే.‘వారణాసి’ సినిమాని 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అంటే సరిగ్గా ఏడాది తర్వాత ఇదే రోజున విడుదల కానుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఆసక్తికర పోస్ట్ చేసింది. ''ఒకవేళ మనం కాలయానం చేస్తూ ఒక ఏడాది ముందుకు చేరుకుంటే, ఈ సమయానికి మనం ‘వారణాసి’ మూవీ చూస్తూ ఉంటాం. ఇట్స్ షో టైమ్'' అని పేర్కొన్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈరోజు ఉదయం తన ఎక్స్‌లో ‘365’ అని పోస్ట్‌ పెట్టారు. కీరవాణి పోస్టుపై రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ స్పందిస్తూ.. ''ఇది సరే.. కానీ సాంగ్‌ ఎప్పుడు డెలివరీ చేస్తావ్?'' అని ప్రశ్నించారు. దానికి ‘వారణాసి’ టీమ్ రియాక్ట్ అవుతూ.. ''సెట్ వేస్తున్నారంటగా.. డైరెక్టర్ హ్యాపీయా'' అంటూ మహేష్ బాబు 'పోకిరి' స్టైల్ లో రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో 'వారణాసి' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ కి ముందు సోషల్ మీడియాలో మహేష్ బాబు, రాజమౌళి మధ్య ఇలాంటి చర్చే జరిగింది. ఆ తర్వాతే అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు కీరవాణి, కార్తికేయ పోస్టులు చూసి.. త్వరలో ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘వారణాసి’ ఒక గ్లోబ్ ట్రాటింగ్ మూవీ. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ జోనర్స్ కలబోసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఇందులో మహేష్ బాబు రుద్రగా, రాముడిగా కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ సెట్‌లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారని సమాచారం. తాజాగా పృథ్వీరాజ్‌ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “నేను ఎంతో కష్టపడి పనిచేసిన ఒక షెడ్యూల్ ముగిసింది. ఈ ‘చీట్ మీల్’ నాకు దక్కింది. థాంక్యూ నారాయణ గారు” అని పేర్కొన్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో 'వారణాసి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్ కాంచీ దీనికి కథ అందిస్తున్నారు.