భార్యను పంపిస్తామని అడవిలోకి తీసుకెళ్లి.. ఐదేళ్ల బాలుడి ఎదుటే తండ్రి హత్య కేసులో.. విస్తుగొలిపే విషయాలు.

Wait 5 sec.

అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగిన తమిళనాడు వాసి గాంధీ హత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడులోని గుడియాత్తం ప్రాంతానికి చెందిన గాంధీని, కొంతమంది దుండగులు పక్షిరాజపురం అటవీ ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి వేళ ఈ ఘటన జరిగింది. .. సోమవారం ఉదయమే అడవి నుంచి ఊర్లోకి నడుచుకుంటూ వచ్చి ఓ అంగన్వాడీ కార్యకర్తకు విషయాన్ని చెప్పాడు. దీంతో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్య కేసులో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. గుడియాత్తంకు చెందిన గాంధీ, రాసాతి భార్యాభర్తలు. వీరికి సందీప్ అనే ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్ని నెలల కిందట రాసాతికి అన్నమయ్య జిల్లాలోని బోయకొండ యానాదిపాళ్యానికి చెందిన నరసింహులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్త, కొడుకును వదిలేసిన రాసాతి.. నరసింహులతో కలిసి వచ్చేసింది. భార్యను వెతుక్కుంటూ గాంధీ, సందీప్ కొన్ని రోజుల కిందట చౌడేపల్లె మండలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన భార్య రాసాతి బోయకొండ యానాదిపాళ్యంలో ఉన్నట్లు గాంధీ తెలుసుకున్నారు. ఆదివారం అక్కడకు చేరుకున్నారు.అయితే నీ భార్యను నీతోనే పంపిస్తామంటూ గాంధీకి కొంతమంది దుండగులు నమ్మబలికారు. ఆ తరువాత అతనికి మద్యం తాగించి.. కొడుకు సందీప్‌తో పాటుగా పక్షిరాజపురం అడవిలోకి తీసుకెళ్లారు. ఆదివారం రాత్రి సమయంలో అడవిలోనే గాంధీని హత్య చేశారు. ఈ ఘటనతో భయపడిపోయిన సందీప్.. రాత్రి మొత్తం తండ్రి శవం పక్కనే ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. తెల్లవారగానే అడవిలో నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి.. యానాదిపాళ్యంలోని అంగన్వాడీ కార్యకర్త ధనలక్ష్మికి వివరాలు చెప్పాడు. అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. గాంధీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. గాంధీ హత్య కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఐదేళ్ల బాలుడి ఎదుట అతని తండ్రిని రాళ్లతో కొట్టి హత్య చేశారనే వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. తండ్రిని హత్య చేసి, పసిపిల్లాడిని అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా వదిలేసిన వైనం.. దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోవటం, తండ్రి దారుణంగా హత్యకు గురికావటంతో ఆ ఐదేళ్ల బాలుడి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.