: మనకు పెట్టుబడులకు ఎన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది. గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. చిన్న మొత్తాల్లోనూ డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది. ఇంకా పెట్టుబడులపై దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది.. ఇదే సమయంలో పాత పన్ను విధానంలో టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఇప్పుడు ఇలాంటి పోస్టాఫీస్ పథకంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం.. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. ఇక్కడ వడ్డీ రేట్లను పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు లేదా స్థిరంగా కూడా ఉంచొచ్చు. అయితే దాదాపుగా రెండేళ్లుగా కేంద్రం ఈ పథకాల వడ్డీ రేట్లను మార్చట్లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి వడ్డీ రేట్లు పెరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతుంది కేంద్రం. ఇటీవల . అన్నింట్లోనూ రేట్లు స్థిరంగానే ఉన్నాయి. మనం ఇప్పుడు ఇందులో పోస్టాఫీస్ పథకాల్లో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో ఒకటైన పీపీఎఫ్ గురించి తెలుసుకుందాం. దీంట్లో వడ్డీ రేటు సంపద పెద్ద మొత్తంలో సమకూరుతుందని చెప్పొచ్చు. వరుసగా ఇక్కడ 15 ఏళ్లు డబ్బులు డిపాజిట్ చేయాలి. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 పెట్టుబడితో చేరొచ్చు. గరిష్ఠంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు కూడా డిపాజిట్ చేయొచ్చు. మెచ్యూరిటీ తర్వాత ఐదేళ్ల చొప్పున ఎన్ని సార్లయినా పొడిగించుకోవచ్చు కూడా. ఈ పథకంలో లోన్ సదుపాయం కూడా పొందొచ్చు. మరోవైపు ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. పెట్టుబడి సహా వడ్డీ ఆదాయంపై, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ పడదు. వీటిల్లో పెట్టుబడులపై పాత పన్ను విధానం కింద.. పన్ను మినహాయింపు పొందొచ్చన్నమాట. పెట్టుబడి సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో చెల్లించొచ్చు. ఉదాహరణకు మీరు పీపీఎఫ్ స్కీంలో నెలకు రూ. 5 వేల చొప్పున.. ఏటా రూ. 60 వేల చొప్పున 15 ఏళ్లకు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి మొత్తం రూ. 9 లక్షలపై వడ్డీ రూపంలో రూ. 7.27 లక్షలు వస్తాయి. మొత్తం చేతికి రూ. 16.27 లక్షలు వస్తాయి. అదే నెలకు రూ. 10 వేల చొప్పున ఏటా రూ. 1.20 లక్షల చొప్పున జమ చేస్తే మెచ్యూరిటీకి రూ. 32.54 లక్షలు వస్తాయి. వడ్డీతోనే ఇక్కడ రూ. 14.54 లక్షలు వస్తాయి.