ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. మంగళవారం రాత్రితో మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని ట్రంప్ హెచ్చరించారు. వాస్తవానికి ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టడం తనకు ఇష్టం లేకపోయినా.. ఆ పనిచేయక తప్పడం లేదని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఇరాన్‌లో 47 ఏళ్ల అవినీతి, అరాచకపాలన అంతం కానుందని ఆయన జోస్యం చెప్పారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం వల్ల అద్బుతాలు జరగొచ్చేమోనని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు కొత్త, తెలివైన నాయకత్వం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన 48 గంటల గడువు నేటి (ఏప్రిల్ 7) రాత్రితో ముగియనున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది.‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది.. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది.. 47 ఏళ్లుగా కొనసాగుతున్న దోపిడీ, అవినీతి, మరణాలకు చివరకు ముగింపు" పలకనున్నాం.. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి.. బహుశా విప్లవాత్మకంగా అద్భుతం ఏదైనా జరగొచ్చు’’ అని అంటూ తన ప్రకటనలో ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశానికి ట్రంప్ ఆస్కారం కల్పించారు.హర్మూజ్ జలసంధిని మంగళవారం రాత్రి 8 గంటల (EST)లోగా ఇరాన్ తిరిగి తెరవకుంటే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని ట్రంప్ మరోసారి హెచ్చరిస్తూ.. యుద్ధ నేరాలకు పాల్పడటం గురించి తాను అస్సలు ఆందోళన చెందడం లేదని సోమవారం అన్నారు.పౌర మౌలిక సదుపాయాలపై దాడి చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అమెరికాను హెచ్చరించినట్టు ఆయన ప్రతినిధి సోమవారం తెలిపారు. అమెరికా ఒత్తిడిని ఇరాన్ తిరస్కరించింది. కేవలం కాల్పుల విరమణ కాకుండా యుద్ధానికి పూర్తిస్థాయిలో ముగింపు పలకాలని అధికారులు పట్టుబడుతున్నారని ప్రభుత్వ మీడియా నివేదించింది.మరోవైపు, హర్మూజ్ జల సంధికి సమీపంలోని ఇరాన్ చమురు ఎగుమతుల హబ్ ఖర్గ్ ద్వీపం వద్ద మంగళవారం భారీ పేలుళ్లు జరిగినట్టు ఆ దేశ మీడియా మెహ్రా నివేదించింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే ఇరాన్‌లోని ప్రతి ఒక్క విద్యుత్ కేంద్రం, వంతెనను లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో భారీ బాంబు దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు.