ఏపీకి కేంద్రం నుంచి బిగ్ రిలీఫ్.. 1961 నుంచి వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం

Wait 5 sec.

శ్రీకాకుళంజిల్లా వాసుల కల నేరవేరనుంది.. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పడింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి తెర దించుతూ.. వీడబ్ల్యూడీటీ (వంశధార నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌) ఇచ్చిన తుది తీర్పును అమలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ట్రైబ్యునల్‌ బ్యారేజీ నిర్మాణానికి స్పష్టమైన అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తే శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాలకు నీళ్లు అందించొచ్చు. అయితే బ్యారేజీకి సంబంధించి జారీ చేసిన గెజిట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ట్రైబ్యునల్ వంశధారపై నేరడి బ్యారేజీ కట్టేందుకు అనుమతించింది. ఈ బ్యారేజీకి ఎనిమిది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి హెడ్‌ స్లూయిజ్‌ ఉంటుంది. ఒడిశా అవసరాల కోసం బ్యారేజీకి దిగువున ఎడమ హెడ్ స్లూయిజ్ (నిర్మాణ ఖర్చు ఒడిశా భరించాలి) ఉంటుంది. ఆరు నెలల్లోగా ఒడిశా ప్రభుత్వం దీని సామర్థ్యాన్ని ఏపీకి తెలియజేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు వంశధార నీటిని బ్యారేజీ నుంచి తీసుకునేందుకు అనుమతిస్తారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 106 ఎకరాలను ఒడిశా సేకరించి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలి. ఈ భూసేకరణకు సంబంధించిన పరిహారాన్ని ఏపీ ఒడిశాకు చెల్లించాలి. బ్యారేజీ నీటి లభ్యత 115 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు 50:50 ప్రాతిపదికన పంచుకోవాలి. ఒకవేళ నీటి కొరత వస్తే ఆ వాటాను రెండు రాష్ట్రాలు దామాషా ప్రకారం తగ్గించాలి. ఒకవేళ నీటి లభ్యత పెరిగితే అదే నిష్పత్తిలో రెండు రాష్ట్రాలు పెంచుకోవాలి.వీడబ్ల్యూడీటీ (వంశధార నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌) నిర్ణయాలను అమలు చేయడానికి, పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనిలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యుూసీ) నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరు, ఒడిశా నుంచి ఒకరు చొప్పున ఉంటారు. ఈ కమిటీకి కార్యాలయం, పర్యవేక్షణకు అవసరమయ్యే ఖర్చు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరించాలి. ఈ పర్యవేక్షణ కమిటీ నిర్ణయాలను అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సింగిల్‌ మెంబర్‌ ‘రివ్యూ అథారిటీ’ని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో ఏర్పాటు చేశారు. అలాగే ఏటా జూన్‌ 1 నుంచి నవంబరు 30 వరకు.. గొట్టా బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యే వరకు సైడ్‌ వియర్‌ ద్వారా 8 టీఎంసీల నీటిని వినియోగానికి అనుమతి వచ్చింది. మొత్తం 8 టీఎంసీల నీటి వినియోగం పూర్తయ్యే వరకు లేదా డిసెంబరు 1న గేట్లను మూసేయాలని తెలిపింది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరడి దగ్గర 1961లో బ్యారేజీ నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేశారు. 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు 18 టీఎంసీల సామర్థ్యంతో ప్లాన్ చేశారు. అప్పటి నుంచి ఒడిశా ఈ బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరం చెప్పడంతో ఆగిపోయింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఆ తర్వాత 2006లో ఒడిశా ప్రభుత్వం కూడా నేరడి బ్యారేజీ నిర్మాణంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు 2009లో దీనిపై స్టేటస్‌కో ఇచ్చి వంశధార ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2010లో వంశధార నది జలవివాదాల ట్రైబ్యునల్‌ ఏర్పాటుకాగా.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ఏళ్ల తరబడి వాదనలు వినిపిస్తున్నాయి. విచారణల అనంతరం, ట్రైబ్యునల్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు చెరో 57.5 టీఎంసీల నీటిని కేటాయించి, బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఇటీవల వంశధార ట్రైబ్యునల్‌ కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఆధారంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బ్యారేజీ నిర్మాణానికి గెజిట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణంకు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం.. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశంపై ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. నేరడి బ్యారేజి నిర్మాణంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌కు ధన్యవాదాలు తెలిపారు.