తెలంగాణకు వర్ష సూచన.. 3 రోజుల పాటు వానలు.. ఆ తర్వాత ఎండలు

Wait 5 sec.

రాష్ట్రంలో ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలతో వాతావరణం అంతా గజిబిజిగా ఉంటోంది. మరోవైపు.. కొన్ని రోజులు వర్షాలు, మేఘావృతం అవుతోంది. దీంతో అటు వర్షాలు, ఇటు ఎండలతో ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో నేటి (మంగళవారం) నుంచి 3 రోజుల పాటు ఏప్రిల్ 7, 8, 9వ తేదీల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 3 రోజుల పాటు ఆయా జిల్లాల్లో వానలు కురిసే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాలలో మంగళవారం రోజున అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇక ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఆయా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో వీలైనంత ఇంట్లోనే ఉండాలని హితవు పలికారు. వాతావరణ పరిస్థితులను గమనించి రైతులు, ప్రయాణికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఇక 3 రోజుల తర్వాత తెలంగాణలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల తర్వాత ఎండలు దంచి కొట్టనున్నట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో 3 రోజుల అనంతరం గరిష్ట ఉష్ణోగ్రతల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే అధికంగా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని తెలిపింది. అటు వర్షాలు, ఇటు ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.