వేసవి సెలవుల్లో మీ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ అలర్ట్

Wait 5 sec.

ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌‌‌గా ఉన్న వీసీ కేవలం నగరంలో శాంతి భద్రతల మీదనే కాకుండా.. సమాజంలో ఎన్నో విషయాలపై నిత్యం ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉంటారు. అదే సమయంలో కొన్ని విషయాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సీపీ సజ్జనార్.. ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. సైబర్ నేరాలపై ఎక్కువగా అవగాహన కల్పించే సీపీ సజ్జనార్.. తాజాగా వేసవి కాలంలో పిల్లలపై తల్లిదండ్రులు స్పెషల్ ఫోకస్ పెట్టాలంటూ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. వేసవి సెలవులే కదా అని పిల్లలను పట్టించుకోవడం అశ్రద్ధ చేస్తే.. అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని సున్నితంగా హెచ్చరించారు. వేసవి సెలవుల్లో స్కూళ్లు, ట్యూషన్లు, చదువులు లేక పిల్లలు ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండటంతో ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం.. సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చిన్నా పెద్దా తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో సీపీ సజ్జనార్.. వారి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత వేసవి సెలవుల వినోదం డిజిటల్ వ్యసనం కాకూడదని.. తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు.ఒకప్పుడు వేసవి సెలవులు అంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు.. పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం ఉండేదని సీపీ సజ్జనార్ గుర్తు చేశారు. కానీ ఇప్పుటి బాల్యం కేవలం 5 అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై.. పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల.. వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని ఒంటరితనానికి గురవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే పిల్లలు సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం.. రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై తిండి, నిద్ర మానేసి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని సీపీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అందరిలో కలివిడిగా లేక.. చిన్న చిన్న మందలింపులకే పిల్లలు మనస్తాపం చెంది.. ఇంటిని వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకి వస్తున్నాయని.. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయని సజ్జనార్ తెలిపారు.అందుకే ఈ ఎండాకాలం సెలవుల్లో పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే.. తల్లిదండ్రులు తమ సమయాన్ని గిఫ్ట్‌గా ఇవ్వండి అంటూ సీపీ సజ్జనార్ హితవు పలికారు. అదే సమయంలో వారు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు.. ఎవరితో మాట్లాడుతున్నారనే అంశాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. మరీ ముఖ్యంగా ఎగ్జామ్ రిజల్ట్స్ విషయంలో పిల్లలకు కొండంత భరోసానిస్తూ.. వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల అప్రమత్తతే బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని సీపీ సజ్జనార్ వెల్లడించారు.