ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు పథకం ప్రారంభమైన కొత్తల్లో అక్కడక్కడా బస్సుల్లో సీట్లు, ఆధార్ కార్డులు, టికెట్ల విషయంలో వివాదాలు జరిగాయి. తాజాగా విజయవాడలో ఉచిత బస్సు పథకం టికెట్ విషయంలో మొదలైన గొడవ కండక్టర్‌పై దాడి వరకు వెళ్లింది. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి విస్సన్నపేటకు ఆర్టీసీ సర్వీస్ నంబర్ 308 బస్సు బయల్దేరింది. ఇద్దరు మహిళలు ఆ బస్సులో ఎక్కారు.. సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర కండక్టర్ జీరో టికెట్ ఇచ్చేందుకు వారిని ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. అయితే ఇద్దరు మహిళలు మూడు ఆధార్ కార్డులు కండక్టర్‌కు అందించారు. ఇద్దరే ఉన్నారు కదా మూడు ఆధార్ కార్డులు ఎందుకు ఇస్తున్నారని కండక్టర్ ప్రశ్నించారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.. ఈ కోపంలో మహిళ బస్సు కండక్టర్ చెంపపై కొట్టారు. కండక్టర్‌పై మహిళ దాడి చేయడంతో డ్రైవర్ బస్సును నేరుగా నున్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత నున్న పోలీసులు తమ పరిధిలోకి ఈ కేసు రాధని చెప్పడంతో.. మళ్లీ బస్సును ప్రయాణికులతో సహా సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళ తనపై దాడి చేసినట్లు కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు ఆధార్ కార్డులు ఎందుకిచ్చావ్ అంటూ కండక్టర్ ఏకవచనంతో దూషించడంతో తాను చెంపై కొట్టానని మహిళ చెబుతున్నారు. ఈ ఎపిసోడ్‌లో కండక్టర్ వాదన మరోలా ఉంది.. తాను టికెట్ తీసుకోమని చెప్పానని.. మూడు ఆధార్ కార్డులు ఎందుకమ్మా అని ప్రశ్నించానన్నారు. వెంటనే ఆమె తన చెంపై కొట్టిందని.. ఆమెను తాను దూషించలేదని కండక్టర్ అంటున్నారు. ఈ వివాదంతో బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడంతో మిగిలిన ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. తమను వేరే బస్సులో పంపకుండా ఇలా స్టేషన్‌కు తీసుకురావడం సరికాదన్నారు. మరోవైపు పోలీసులు బస్సు కండక్టర్, మహిళ స్టేట్‌మెంట్‌లను తీసుకుని విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఉచిత బస్సు పథకం తర్వాత ఆర్టీసీ సిబ్బందికి ఇలాంటి తలనొప్పులు తప్పడం లేదు.