ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటరన్స్ చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కారణంగానే తన కెరీర్ ముగిసిందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐపీఎల్‌తో తనకు జరిగిన నష్టాన్ని వివరించాడు. ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో తనకు విభేదాలు మొదలయ్యాయని పీటర్సన్ వివరించాడు. 2008లో లీగ్ మొదలైనప్పుడు ఈసీబీ తమ కాంట్రాక్ట్ ప్లేయర్లను ఐపీఎల్‌లో పాల్గొననివ్వలేదని, ఆ తర్వాత కూడా షరతులు పెట్టిందంటూ చెప్పాడు. అలాంటి సమయంలోనే 2009లో ఆర్సీబీ తరఫున ఆడేందుకు తాను తీసుకున్న నిర్ణయం, తన కెరీర్‌పైనే ప్రభావం చూయించిందని తెలిపాడు. "నేను చాలా త్యాగాలు చేశాను. చివరికి నా కెరీర్ కూడా కోల్పోయాను. ఆ సమయంలో ఈసీబీలో ఉన్న వాళ్లంతా నా మీదకు వచ్చారు. ఇది అప్పట్లో చాలా సెన్సేషనల్ అయింది. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాను. మీరు చేసిన త్యాగాలతోనే ఇప్పుడు మేం లాభపడుతున్నాం అని బట్లర్ కూడా అంటుంటాడు" అని కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు. అప్పట్లో తనపై ఇంగ్లండ్ మీడియా కూడా తప్పుడు ప్రచారం చేసిందంటూ పీటర్సన్ ఆరోపించాడు. ఈసీబీ ది టెలిగ్రాఫ్ ద్వారా తనపై విచ్ హంట్ నడిపించారని తెలిపాడు. అయితే, ఇవన్నీ ముగిసిపోయాయని.. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నానని చెప్పాడు. అప్పట్లో తాను చేసిన త్యాగాల ఫలితంగానే ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెటర్లు లాభపడుతున్నారని కెవిన్ పీటర్సన్ గుర్తు చేశాడు. తనపై అలాంటి ప్రచారం జరగడంతో 33 ఏళ్లలోపే తన కెరీర్ ముగిసిందని, తాను కనీసం 150 నుంచి 160 టెస్టు మ్యాచ్‌లు ఆడి 12 వేలకు పైగా పరుగులు చేయగలిగిన వాడినని గుర్తు చేసుకుని పీటర్సన్ బాధపడ్డాడు. పీటర్సన్ తన టెస్టు కెరీర్‌లో 104 మ్యాచ్‌లు ఆడి 8,181 పరుగులు చేశాడు. అందులో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.