తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని ఇటీవల తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిర్మాతల గిల్డ్‌ వ్యతిరేకించింది. థియేటర్లకు పర్సంటేజీ ఇవ్వడం కుదరదని ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ తేల్చి చెప్పింది. అయితే పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని ఫిల్మ్‌ ఛాంబర్‌ చెబుతోంది.సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రెంటల్ సిస్టమ్ కి బదులుగా, పర్సంటేజీ విధానంలో సినిమాలు ప్రదర్శించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. హైదరాబాద్‌లోని 23 థియేటర్లు పర్సంటేజీ సిస్టమ్ లో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిలిం ఛాంబర్ అఫిషియల్ గా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్, బాబీ వంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ దీనికి అంగీకరించారని, ఒక్క మైత్రీ శశిధర్ రెడ్డి మాత్రం ఆలోచించి తమ అభిప్రాయం చెప్తానని చెప్పినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో నిర్మాతల గిల్డ్ చర్చించుకొని, పర్సంటేజీ విధానాన్ని వ్యతిరేకించారు. ఎప్పటిలాగే అద్దె ప్రాతిపదికన సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగించాలని అభిప్రాయ పడ్డారు. దీనిపై తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత వై. రవిశంకర్‌ స్పందించారు. పర్సంటేజీ విధానాన్ని స్వాగతించలేమని అన్నారు. “ఇప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని, ఇంప్లిమెంట్ చేయాల్సిందే అంటే.. అది చాలా అన్యాయం. అందుకే మేము దాన్ని వ్యతిరేకించాం. రీసెంట్ మేం అదే చెప్పాం” అని ఆయన తెలిపారు.“ముందు నుంచే ఒక ప్రిపరేషన్ తో ఉంటే అది వేరు కానీ.. ఇప్పటికిప్పుడు ఒకరిద్దరు మాట్లాడేస్తే అయిపోయేది కాదు ఇది. సినీ ఇండస్ట్రీలో ఈ ఎకో సిస్టమ్ లో కొన్ని వందల వేలమంది ఉన్నారు. మనది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యమయ్యే నిర్ణయం తీసుకోవాలి. ఎకో సిస్టమ్ లో ఉన్న అందరి భాగస్వామ్యంలో ఒక కమిటీ వేసి, దానిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరముంది. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం జరగాలి”“ఏది మంచి ఏది చెడు అనే దానిపై ఒక రిపోర్ట్ రెడీ చేసి, అప్పుడు ఆలోచించి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంతేకానీ ఓవర్ నైట్ లోఈ రూల్ ఇలా మారిపోయింది.. అలా మారిపోయింది అంటే అది అయ్యే పనికాదు. ఈ విధానంతో భారీ బడ్జెట్‌ చిత్రాలపై ఎఫెక్ట్ పడుతుంది. తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆల్రెడీ అందరం చాలా ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాలు రూపొందిస్తున్నాం. వాటి రికవరీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటే, ఈసారి ఇంటర్నేషన్ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది” అని మైత్రీ నిర్మాత రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.* ఇదిలా ఉంటే, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ మాత్రం పర్సంటేజీ సిస్టమ్ లోనే సినిమాలు ప్రదర్శించాలని చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానమే అమలవుతోందని వెల్లడించింది. తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నిర్మాతల గిల్డ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఏప్రిల్‌ 30లోగా ఫైనల్ డెసిజన్ తీసుకోవాలని కోరింది. పర్సంటేజీ ఇవ్వకుంటే మే 1వ తేదీ నుంచి నైజాంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మూసివేసే యోచనలో ఉన్నట్లు తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ సంఘం వెల్లడించింది. మరి దీనిపై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తారేమో చూడాలి.