పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్థాన్ వేదికగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో చర్చల కోసం పాకిస్థాన్ వచ్చిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. అయితే అమెరికా చర్చలలో పురోగతి లేకపోవటానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చల మధ్యలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఫోన్ చేశారని.. ఆ తర్వాత చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బా్స్ అరాఘ్చి ఆరోపించారు. చర్చల మధ్యలో జేడీ వాన్స్‌కు, నెతన్యాహూ ఫోన్ చేశారని.. ఆ తర్వాతే కీలక పురోగతి దిశగా వెళ్తున్న చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 21 గంటల పాటు జరిగిన చర్చలలో ఎలాంటి ఒప్పందం కుదరకపోవటంతో జేడీ వాన్స్ ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకుంది. జేడీ వాన్స్‌కు నెతన్యాహూ ఫోన్ కాల్ తర్వాత అమెరికా - ఇరాన్ చర్చల దృష్టి మొత్తం ఇజ్రాయెల్ ప్రయోజనాలవైపు మళ్లిందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు. యుద్ధం ద్వారా సాధించలేని దానిని చర్చల ద్వారా సాధించేందుకు అమెరికా ప్రయత్నించిందని అన్నారు. పూర్తి నమ్మకంతోనే పాకిస్థాన్‌కు చర్చల కోసం వెళ్లామన్న ఇరాన్ విదేశాంగ మంత్రి.. అమెరికాకు వెళ్లిపోతూ జేడీ వాన్స్ విలేకర్ల సమావేశం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. అది అవసరం లేదని అన్నారు. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నామని, సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు చర్చల మధ్యలో జేడీ వాన్స్‌కు, ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ చేశారనే వార్తలపై అమెరికా నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. మరోవైపు 40 రోజుల యుద్ధం తర్వాత శాంతి చర్చలకు అంగీకరించిన ఇరాన్, అమెరికా రెండు వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించాయి. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారం కోసం పాక్ వేదికగా చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఎలాంటి ఫలితమూ రాలేదు. దీంతో ఈ గడువు ముగిసిన తర్వాత అనే ఆందోళన నెలకొంది. అలాగే ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్‌కు సుంకం చెల్లించే నౌకలను వెంబడించి అడ్డుకోవాలని ట్రంప్ అమెరికా నౌకాదళాన్ని ఆదేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే హర్మూజ్ పూర్తిగా తమ కంట్రోల్‌లో ఉందని ఇరాన్ స్పష్టం చేసింది.