చారిత్రాత్మక 10 రోజుల జాబిల్లి యాత్ర తర్వాత భూమికి క్షేమంగా ఆర్టెమిస్ II

Wait 5 sec.

50 ఏళ్ల తర్వాత మానవసహిత చంద్రుడి మిషన్ విజయవంతమైంది. జాబిల్లిని చుట్టేసిన ఆర్టెమిస్‌-2 బృందం తిరిగి భూమికి క్షేమంగా చేరుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.38 గంటలకు పసిఫిక్‌ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో ఒరాయన్‌ క్యాప్సుల్‌ ల్యాండ్‌ అయింది. అందులోని నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. దీంతో పది రోజుల మిషన్ విజయవంతంగా పూర్తయింది. భూమి నుంచి ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమగాములుగా ఆర్టెమిస్‌-2 బృందం చరిత్ర సృష్టించింది. అర్టెమిస్ II యాత్రలో ముగ్గురు అమెరికన్లు, ఓ కెనడియన్ సహా వ్యోమగాములు ఇప్పటి వరకూ మానవులు చూడని చంద్రుడి ఆవలివైపునకు వెళ్లొచ్చారు. భూమి నుంచి 4.06 లక్షల కిలోమీటర్ల ప్రయాణించారు. అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వ్యోమగాములు వీక్షించడం మరో విశేషం.భూవాతావరణంలోకి వ్యోమనౌక ధ్వనికంటే 33 రెట్లు వేగంతో ప్రవేశించింది. 1960,70 దశకంలో చేపట్టిన అపోలో మిషన్ల తర్వాత వ్యోమనౌక ఇంతటి వేగంతో రావడం ఇదే మొదటిసారి. క్రమంగా ఓరియన్ క్యాప్సూల్ స్వీయనియంత్రణ పైలట్ సాయంతో వేగాన్ని తగ్గించుకుని.. భూమికి చేరుకుంది. భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో ఘర్షణ వల్ల ఏర్పడిన వేడికి దాని చుట్టూ ఎర్రటి ప్లాస్మా ఆవరించి, కాసేపు కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ, ఆందోళన వ్యక్తమైంది. అయితే, వేల డిగ్రీలో ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించిన హీట్ షీల్డ్ ఆశలను ఒమ్ముచేయలేదు.