హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

Wait 5 sec.

ప్రభుత్వ ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపురంలో హైడ్రా అధికారులు.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ చేపట్టింది. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూముల్లో ఇళ్లను మాత్రం కూల్చడం లేదని హైడ్రా అధికారులు తేల్చి చెప్పారు. ఐలాపురం గ్రామం, తండాలో ఉన్న నివాస గృహాల జోలికి కానీ హైడ్రా అధికారులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఐలాపురం గ్రామంలో ఉన్న 1263 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు, సీజ్ చేసుకున్న ఖాళీ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.1998 నుంచి స్టేటస్ కో కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా అక్కడ నిర్మించిన ముఖిమ్‌ అనే వ్యక్తికి చెందిన గెస్ట్ హౌస్‌ను హైడ్రా అధికారులు నేలమట్టం చేసింది. అలాగే అతని సోదరుడు అజీమ్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల బిల్డింగ్‌ను కూడా అధికారులు తొలగించారు.ఐలాపూర్ గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో ఇప్పటికే అనేక ఇళ్లను నిర్మించారు. ఐలాపురం తండా, గ్రామంలోని పేదల ఇళ్లను తొలగించకుండా.. కేవలం ఖాళీ స్థలాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. మిగిలి ఉన్న 860 ఎకరాల ఖాళీ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు ఈ భారీ ఆపరేషన్‌కు తెర తీశారు. ఈ ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ.15 వేల కోట్ల పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైడ్రా అధికారులు కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను రంగంలోకి దించారు. హైడ్రా అధికారుల కూల్చివేతలతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.