సాధారణంగా ప్రత్యర్థి జట్టులో ఎవరైనా హిట్టింగ్ చేస్తున్నా, తమ జట్టు ఓడిపోయినా ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. అది ఆర్సీబీ అయినా.. టీమిండియా అయినా.. ఏదైనా కోహ్లి రియాక్షన్ మాత్రం ఫుల్ ఫైర్ మీద ఉంటుంది. కానీ పదిహేనేళ్ల వీర బాదుడు బాది ఆర్సీబీని ఓడిస్తే.. కోహ్లి మాత్రం ఎంతో ఆప్యాయంగా అభినందించాడు. ఆ ఫొటో సోషల్ మీడియా హృదయం గెలిచేసింది. రాజస్థాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీని చూసిన విరాట్ కోహ్లి ఎంతో ఆనందంగా పలకరించాడు. కోహ్లి ఫేస్‌లో టీమిండియాకు మరో వీరోచిత బ్యాటర్ దొరికాడన్న ఆనందం కనిపించింది. దాంతో పాటు వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. వైభవ్ క్యాప్‌పై విరాట్ కోహ్లి తన సైన్ చేస్తూ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అందులో డియర్ వైభవ్.. చాలా బాగా ఆడావు అంటూ రాశాడు. కోహ్లి ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్యాప్‌ను వైభవ్ సూర్యవంశీ చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. ఆర్సీబీ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా వైభవ్ సూర్యవంశీకే దక్కింది. దాంతో అవార్డు, ఆరెంజ్ క్యాప్ దాంతో పాటు కోహ్లి ఆటోగ్రాఫ్ క్యాప్‌ను ప్రత్యేకంగా ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లి ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్యాప్‌ను ప్రత్యేకంగా వీడియోతో పోస్ట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్సీబీ జట్టు ఆరంభంలో వికెట్లు కోల్పోయినా కెప్టెన్ రజత్ పటిదార్ 40 బంతుల్లో 63 పరుగులు చేయడం, వెంకటేశ్ అయ్యర్ 15 బంతుల్లో 29 పరుగులు చేయడంతో ఆర్సీబీ 201/8 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. వైభవ్ 78, ధృవ్ జురేల్ 81, జడేజా 24 పరుగులతో రాణించి 18 ఓవర్లలోనే జట్టును గెలిపించారు.