ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలపై రవాణాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ తప్పిదం కారణంగానే.. గతేడాది కర్నూలు, మారేడుమిల్లి.. గత నెలలో మార్కాపురం బస్సు ప్రమాదాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల తర్వాత ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది. హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారుల్ని మంత్రులు ఆదేశించారు. గతంలో జరిగిన ప్రమాదాల కారణాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులు, ఫిట్‌నెస్ లేని బస్సుల విషయంలో ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ నివారణ చర్యలు, రహదారి భద్రతపై తీసుకున్న నిర్ణయాలను ఈ సమావేశంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల మార్కాపురం బస్సు ప్రమాద ఘటన తర్వాత మొత్తం 16 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేశామన్నారు మంత్రి మండిపల్లి. గత పది రోజుల నుంచి 10వేల వాహనాలను తనిఖీ చేశామని.. కొంతమంది చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఒకవేళ అవసరమైతే ప్రజల ప్రాణాలను బలిగొంటున్న స్లీపర్‌ బస్సుల్ని భవిష్యత్తులో రద్దు చేస్తామన్నారు రాంప్రసాద్ రెడ్డి. ఈ అంశంపై ఇప్పటికే దీనిపై కేంద్రాన్ని సంప్రదించామని.. ప్రమాదాల నివారణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ విషయంలో రాజీపడేది లేదని.. ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు సమయాన్ని నిర్దేశిస్తామన్నారు. ఒకవేళ బస్సులు నిర్దేశించిన సమయానికంటే ముందు వెళ్తే బస్సును సిటీలోకి అనుమతించబోమన్నారు. 300 కిలో మీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలన్నారు. ఒక డ్రైవర్ రాత్రి వేళలలో నిద్రపోయేందుకు ఒక సీటు కేటాయించాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో డ్రైవర్‌ను, ఎదురుగా వచ్చే వాహన కదలికల్ని అంచనా వేసేందుకు ప్రతి బస్సులో రెండు కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాలను ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు తెలియజేశామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ఫైర్‌ సేఫ్టీ విషయంలో రాజీ పడేది లేదన్నారు మంత్రి మండిపల్లి. బస్సు అన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉంటే మాత్రమే రోడ్డెక్కనిస్తామని తేల్చి చెప్పారు. ఏపీలో ట్రావెల్స్‌ బస్సులపై వసూలు చేసే పన్ను తక్కువగా ఉండేలా చూస్తామన్నారు. గతేడాది కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత 50 బస్సుల్ని సీజ్ చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నాయన్నారు.. వీటికి కూడా బ్రేకులు వేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం రోడ్ల వెంట స్పీడ్‌ గన్‌ల ఏర్పాటు చేయబోతోందని.. ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరుచేసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి రాంప్రాద్ రెడ్డి.