విదేశాల్లో కోర్టులిచ్చే తీర్పులు, ఉత్తర్వులు మన న్యాయస్థానాలను ప్రభావితం చేయలేవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. యూకే కోర్టు వ్యాఖ్యలు వలసవాద మనస్తత్వాన్ని భారత న్యాయవ్యవస్థపై సంకుచిత ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని ఆక్షేపించింది. భారతీయ కోర్టులు పిల్లల సరరక్షణలో తల్లిదండ్రుల బాధ్యతకు సంబంధించిన అంశాల్లో జోక్యానికి నిరాకరిస్తుంటాయని యూకే కోర్టు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఓ కేసులో యూకే కోర్టు వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు. అయితే ఆయన గతేడాది ఏపీ హైకోర్టులో ఓ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.. తన కుమార్తెను.. అత్తమామలు, భార్య అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో యూకే ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రస్తావించారు. ఆ కోర్టు ఉత్తర్వుల్ని అనుసరించి తన బిడ్డను అప్పగించాలని.. తిరిగి యూకేకి తీసుకెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్‌లో కోరారు. అయితే యూకే కోర్టు ఉత్తర్వుల్ని పరిశీలించిన ఏపీ హైకోర్టు.. కొన్ని అంశాలపై అభ్యంతరం తెలిపింది. ఓవైపు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్, అటు గుంటూరు ఫ్యామిలీ కోర్టులో కేరింగ్ పిటిషన్ దాఖలు చేసినా కూడా.. యూకే కోర్టు చేసిన వ్యాఖ్యల్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాధ్‌రాయ్, జస్టిస్‌ తుహిన్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. యూకే కోర్టు వ్యాఖ్యలు భారతీయ న్యాయస్థానాలను తక్కువ చేయడమేనని ఆక్షేపించింది. విదేశీ కోర్టు ఉత్తర్వులకు మన దేశ న్యాయస్థానాలు కట్టుబడాల్సిన అవసరం లేదని.. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో బిడ్డ సంరక్షణను నిర్ణయించే విషయంలో అవసరం లేదని తేల్చేశారు. తాము చిన్నారి సంరక్షణ విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి అంశాల్లో విదేశీ కోర్టు ఆదేశాలు అమలు చేయడం ముఖ్యం కాదని.. భారతీయ కోర్టులు బిడ్డ సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాప భారత్‌లో ఉన్నంత కాలం భారతీయ చట్టాలే వర్తిస్తాయని.. ఈ ఏడాది జనవరిలో బిడ్డ తల్లి సంరక్షణలో ఉండాలని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. పాపకు మైనారిటీ తీరే వరకు తల్లి దగ్గర ఉంటుందని.. అదే సమయంలో బిడ్డతో మాట్లాడేందుకు తండ్రికి కూడా సంపూర్ణ హక్కులుంటాయన్నారు. తండ్రి ప్రతి రోజూ పాపతో 30 నిమిషాలు వీడియోకాల్‌ ద్వారా మాట్లాడొచ్చని హైకోర్టు తెలిపింది. ఏడాదికోసారి (మైనారిటీ తీరే వరకు) ఆమెను ఇంగ్లండ్‌కు తీసుకెళ్లొచ్చని తండ్రికి కొంత ఊరటనిస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది.