రాష్ట్రంలో లంచగొండి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. లంచాలు తీసుకునే అధికారుల చిట్టా పట్టుకుని.. వారిని వల వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏసీబీకి చిక్కుతున్న లంచగొండి అధికారుల సంఖ్య పెరుగుతోంది. అయినా సరే, కొందరు అధికారులు మాత్రం లంచం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే విత్తన కంపెనీకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ కాలేజీ అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్‌ ఏసీబీ అధికారుల వలలో పడ్డాడు.సీడ్ కంపెనీ ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్స్‌ కావాలంటూ.. 2025 మార్చిలో ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ అప్లికేషన్ అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. లైసెన్స్ కోసం వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌లోని కొందరు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆ వ్యక్తి విసిగిపోయాడు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ అధికారులు అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్‌ వద్దకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆ వ్యక్తి గోవర్ధన్‌ని కలవగా.. రూ. 1.25 లక్షలు ఇస్తే సీడ్ కంపెనీ లైసెన్స్‌ జారీ చేస్తానని చెప్పారు. దీంతో అధికారికి తెలిసిన వ్యక్తి అకౌంట్‌కు బాధితుడు రూ.25 వేలను యూపీఐ ద్వారా పంపించారు.లంచం అడ్వాన్స్ ముట్టిన తర్వాత అతడి దరఖాస్తు ముందుకు కదిలింది. వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌లోని అడిషనల్ డైరెక్టర్, జాయింట్‌ డైరెక్టర్‌.. దరఖాస్తును ఆమోదించి గత నెలలో లైసెన్స్‌ జారీ చేశారు. అయితే మిగిలిన లంచం సొమ్ము కోసం అసోసియేట్ డీన్ గోవర్ధన్‌ ఆ వ్యక్తికి పలుమార్లు ఫోన్‌ చేశారు. గోవర్ధన్ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో.. సీడ్ కంపెనీ లైసెన్స్ పొందిన వ్యక్తి ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పారు. దీంతో ఏసీబీ అధికారులు ఓ ప్లాన్ వేశారు. దీని ప్రకారం మంగళవారం అగ్రికల్చర్ వర్సిటీ కాలేజీలో గోవర్ధన్‌కు ఆ వ్యక్తి రూ. లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత గోవర్ధన్ ఆఫీసుతోపాటు, ఎల్బీ నగర్‌లోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌లోని అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, ఇతర అధికారుల ఆఫీసుల్లోనూ ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ చరిత్రలోనే ఒక అధికారి ఏసీబీకి దొరికిపోవడం, యూనివర్సిటీలో ఏసీబీ తనిఖీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోవర్ధన్‌ చేసిన పనికి.. వర్సిటీ అధికారులు, సైంటిస్ట్‌లు షాక్ అయ్యారు. ఇక అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌పై ఇప్పటికే పలు అభియోగాలు ఉన్నాయి. ఆయన సొంతంగా ఓ సీడ్ కంపెనీని కలిగి ఉండటంతోపాటు.. ఆ సీడ్ కంపెనీ కోసం వర్సిటీ పరిశోధనలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ పదవి కోసం కూడా గోవర్ధన్ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లోనూ గోవర్ధన్‌కు సీడ్ కంపెనీ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆయనకు వర్సిటీ వీసీ పదవి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ వర్సిటీలో క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దానిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతుండగానే.. తాజాగా లంచం ఘటన బయటికి రావడం గమనార్హం.