: ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బందులకు గురి చేస్తున్న అమెరికా, ఇరాన్ యుద్ధంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఇరాన్‌పై జరపాల్సిన భీకర వైమానిక దాడులను రెండు వారాల పాటు నిలిపి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరిస్తేనే ఈ 'రెండు వైపుల కాల్పుల విరమణ' అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇందుకు ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించగా.. ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతోనే వెనక్కి తగ్గిన ట్రంప్..!ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో జరిపిన చర్చల అనంతరం వారి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. "ఇరాన్‌ను ధ్వంసం చేసేందుకు వెళ్తున్న బలగాలను ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నాను. అయితే హార్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన రాకపోకలకు ఇరాన్ తక్షణమే అంగీకరించాలి" అని ట్రంప్ షరతు విధించారు.ఇప్పటికే తాము నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాలన్నింటినీ చేరుకున్నామని ట్రంప్ వివరించారు. ఇరాన్ నుంచి తమకు 10 పాయింట్ల ప్రతిపాదన అందిందని, అది చర్చలకు సరైన ప్రాతిపదికగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న అనేక వివాదాస్పద అంశాలపై ఒక అంగీకారం కుదిరిందని.. ఈ రెండు వారాల విరామం ఆ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇరాన్ సానుకూల స్పందనఅమెరికా ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పందిస్తూ.. దాడులు ఆగిపోతే తాము కూడా తమ రక్షణ కార్యకలాపాలను నిలిపి వేస్తామని ప్రకటించారు. యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేసిన పాకిస్థాన్ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా "ఈ ప్రాంతంలో యుద్ధాన్ని ముగించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నా ప్రియ సోదరులైన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తరపున నేను కృతజ్ఞతలు, ప్రశంసలు తెలియజేస్తున్నాను" అని తెలిపారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. అమెరికా పంపిన 15 పాయింట్ల ప్రతిపాదనపై చర్చలకు తాము సిద్ధమని, రెండు వారాల పాటు హార్మూజ్ జలసంధిలో పర్యవేక్షణతో కూడిన రాకపోకలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇరు దేశాధినేతలు చేసిన ప్రకటనలు చూస్తుంటే.. ప్రస్తుతానికి పరిస్థితి కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. ఇరు దేశాల మధ్య కుదిరే తుది ఒప్పందంపైనే యుద్ధం కొనసాగుతుందా లేక ఆగిపోతుందా అనేది ఆధారపడి ఉంది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.