ఏపీలో పేదలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. మరో 5 లక్షలమందికి ఇళ్ల లబ్ధి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే మరోసారి సామూహిక గృహప్రవేశాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలిందని.. ఇళ్ల నిర్మాణంతో పాటు స్థలాల పంపిణీ ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని గృహనిర్మాణ శాఖ అధికారుల్ని ఆదేశించారు. చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి వివిధశాఖల పనితీరుపై సమీక్ష చేశారు.. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్2.0 మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు సీఎం. ఇసుక సరఫరాకు వర్షాకాలంలో అవాంతరాలు ఎదురవుతాయని.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇసుకను ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేవారిపై నిఘా పెట్టాలన్నారు. రాష్ట్రంలో వర్షాలతో పాటుగా పిడుగులు పడుతున్నాయని.. ప్రజల ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా మెసేజ్‌లు పంపిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయినా సరే అక్కడక్కడా మరణాలు సంభవించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పిడుగులపై ముందుగా ఫోన్లకు మెసేజ్‌లు పంపడంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందినీ అప్రమత్తం చేయాలని సూచించారు. పిడుగులు పడే ప్రాంతంలో టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నెట్‌వర్క్‌ ద్వారా ప్రజలకు తెలియజేయాలి అన్నారు. రాష్ట్రంలో కళాశాల విద్యను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. యూనివర్శిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలని.. సంప్రదాయ కోర్సులతో పాటు డిమాండ్‌ ఉన్న కోర్సులపై ఫోకస్ పెట్టాలన్నారు. అలాగే కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలని సూచించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ చేపట్టి రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, అగ్నిమాపక పరికరాలు సమకూర్చారు. అలాగే అమరావతిలో 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీ సమావేశంలో చర్చ జరిగింది.