ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యం (డీఏ)ను 2.1 శాతం పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆర్టీసీ ఉద్యోగులకు 50.7 శాతం డీఏ ఇస్తుండగా.. ఇప్పుడు దాన్ని 52.8 శాతానికి పెంచారు. డీఏ పెంపు నిర్ణయం 2026 జనవరి నుంచి అందుబాటులోకి వస్తుంది. అయితే గత మూడు నెలల డీఏను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా నెలకు ఒక డీఏ చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పెంపు వల్ల ఆర్టీసీలోని 38 వేలకుపైగా సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంచడం వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా అదనంగా రూ.2.82 కోట్ల భారం పడుతుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.గత ఏడాది జులైలో ఆర్టీసీ ఉద్యోగుల డీఏను 2.1 శాతం మేర పెంచారు. సాధారణంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు చొప్పున డీఏ పెంచుతారు. నిబంధనల ప్రకారం ఏటా జనవరి, జులై నెలల్లో ఈ డీఏ పెంపు అమల్లోకి వస్తుంది. అయితే ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి, ఇతర కారణాల వల్ల డీఏ పెంపు నిర్ణయం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు ప్రభుత్వం బకాయిలతో కలిపి డీఏ విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచినప్పుడు దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు డీఏ పెంచుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల నాటికి ఆర్టీసీకి సుమారు రూ.954 కోట్ల నిర్వహణ లాభం వచ్చింది. అయితే ఉద్యోగుల బకాయిలు, అప్పుల కారణంగా ఆర్టీసీపై భారం పడుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మహాలక్ష్మీ పథకానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తోంది. దీని వల్ల సంస్థ కార్యకలాపాలకు నిధుల సమస్య ఉండటం లేదు. కొత్త బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా లాభాలను పెంచుకోవడానికి ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. యూనియన్ బ్యాంకు బీమా..మరోవైపు తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు బీమా సౌకర్యం విషయంలో యూనియన్ బ్యాంకు ఇటీవల శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు సంభవించే మరణాలకు మాత్రమే బీమా వర్తిస్తుండగా.. ఇక నుంచి సాధారణ మరణాలకు సైతం ఉచితంగానే బీమాను వర్తింపజేయనున్నట్లు తెలిపింది. దీని వల్ల ఆర్టీసీ ఉద్యోగి ప్రమాదవశాత్తూ లేదా సహజ మరణం పొందినా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో ఉన్న కోటి రూపాయల ప్రమాద బీమా సైతం కొనసాగుతుంది.