దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి సినిమా ‘జన నాయగన్‌’. హెచ్. వినోద్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా.. సెన్సార్ సమస్యలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కూడా రాని సినిమా ఇలా బయటకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా మెగాస్టార్ స్పందించారు. ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు ముందే లీక్ అవ్వడంపై చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినిమా అనేది ఎందరో కళాకారుల కలల ప్రతిరూపమని, ఇలాంటి లీకేజీలు చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో చిత్ర బృందానికి తన పూర్తి మద్దతు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి పైరసీని ప్రోత్సహించకుండా, సినిమాను కాపాడాలని కోరారు. కిల్ పైరసీ.. సేవ్ సినిమా అని చిరు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ పెట్టారు. ''జన నాయగన్' సినిమా దురదృష్టవశాత్తు లీక్ అవ్వడం నన్ను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా అనేది నమ్మకం, కృషి, ఎందరో సమిష్టి కలల మీద నిర్మించబడుతుంది. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్స్ ని కాపాడుకోవడం ఎంత కీలకమో మనకు గుర్తు చేస్తాయి. నా ఆలోచనలు, మద్దతు చిత్ర బృందానికి ఎల్లప్పుడూ ఉంటాయి. సినిమాను గౌరవించి, కాపాడే బాధ్యతను మనమందరం తీసుకుందాం. పైరసీని అంతం చేయండి. సినిమాను కాపాడండి'' అని చిరంజీవి పేర్కొన్నారు. మరోవైపు ‘జన నాయగన్‌’ లీకేజీ వ్యవహారంపై నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సన్నివేశాలను షేర్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సినిమాలోని సన్నివేశాలు లీక్‌ చేయడం చట్టపరంగా నేరమని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సినిమా చూసినా, ఎవరికైనా షేర్ చేసినా, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాతల తరఫు లాయర్‌ లీగల్ నోటీసులు జారీ చేశారు.*