హైదరాబాద్‌లో మరో 'సైబర్‌టవర్‌'.. రూ.200 కోట్లతో, 5 ఎకరాల్లో నిర్మాణం

Wait 5 sec.

హైదరాబాద్ నగరం అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది మాదాపూర్‌లోని సైబర్ టవర్స్. ఐటీ విప్లవానికి చిహ్నంగా నిలిచిన ఆ కట్టడం తరహాలోనే.. ఇప్పుడు అత్యాధునిక హంగులతో మరో భారీ భవన సముదాయం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ నగరపాలక సంస్థ కోసం ఈ ఐకానిక్ భవనాన్ని నిర్మించబోతున్నారు. ఐటీ కారిడార్‌లో పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన పరిపాలన భవనం కోసం కైత్లాపూర్‌లోని ఐదెకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు. సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎంసీ కార్యాలయం హైటెక్స్‌లోని న్యాక్ భవనంలో కొనసాగుతుండగా.. కమిషనర్ సృజన ఆధ్వర్యంలో నూతన భవన ఆకృతుల రూపకల్పన వేగంగా జరుగుతోంది. ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని పునర్వ్యవస్థీకరించి (మల్కాజిగిరి)లుగా విభజించిన సంగతి తెలిసిందే. సీఎంసీ పరిధిలోకి మణికొండ, నార్సింగి, శేరిలింగంపల్లి నుంచి మేడ్చల్ వరకు 3 జోన్లు, 16 సర్కిళ్లు వచ్చాయి. ఈ భారీ భవనాన్ని 'జీ+8' అంతస్తులతో నిర్మించనున్నారు. కేవలం మున్సిపల్ కార్యాలయం మాత్రమే కాకుండా.. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.ఒకే గొడుగు కింద అన్ని విభాగాలు చేర్చనున్నారు. ఈ సమీకృత భవన సముదాయంలో సీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయం, విద్యుత్, రెవెన్యూ శాఖల విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు వివిధ పనుల కోసం వేర్వేరు కార్యాలయాలకు తిరిగే అవసరం లేకుండా.. ఒకే భవనంలో అన్ని ప్రభుత్వ సేవలు లభించేలా ప్రణాళికలు రూపొందించారు. ఐటీ నగరిలో ఈ కొత్త భవనం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సైబరాబాద్ నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు ప్రారంభం అవుతాయని అంటున్నారు.