ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల తీరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలండర్లు దొరక్క హోటళ్లు, చిరు వ్యాపారులు దుకాణాలు మూసేశారు. సీఎన్‌జీ కోసం ఆటోలు, కార్లు బంకుల ముందు క్యూలైన్లు కడుతున్నాయి. అయితే ఇదే అదనుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, మళ్లింపులు చేస్తున్నారు. సిలిండర్ బుక్ చేసినా.. సమయానికి డెలివరీ కావటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల కఠిన చర్యలకు ఉపక్రమించింది. గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో దాదాపు రూ. 1.5 కోట్ల విలువైన సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీలో అనవసర జాప్యం జరిగినా, ఎవరైనా సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌కు మళ్లించినా ప్రజలు వెంటనే పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ బుకింగ్‌లు, డెలివరీలను నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజిలెన్స్ బృందాలు గత నెలలో జరిపిన సోదాల్లో 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, 70 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 2,089 కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తామని స్పష్టం చేశారు. సోమవారం సివిల్ సఫ్లయ్ భవన్‌లో వాణిజ్య ఎల్పీజీ సరఫరా, పంపిణీపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, హోటల్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. డిపోల నుంచి సరఫరా మెరుగుపడినప్పటికీ డెలివరీలో జాప్యం జరుగుతోందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 70 శాతం సరఫరా డిమాండ్‌కు అనుగుణంగానే జరుగుతోందని.. కొరత ఉన్న చోట అదనపు నిల్వలను వెంటనే విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించే డిస్ట్రిబ్యూటర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కమిషనర్ హెచ్చరించారు. సిలిండర్లపై నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కావాలని డెలివరీలను ఆలస్యం చేయటం, అక్రమంగా దాచి పెట్టటం వంటివి చేస్తే లైసెన్సుల రద్దుకు సిఫార్సు చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై పౌరసరఫరాల శాఖ, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. హోటల్ నిర్వాహకులు, పారిశ్రామిక ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సమన్వయంతో పనిచేసి సరఫరా వ్యవస్థలో జాప్యం జరగకుండా చూడాలని కమిషనర్ పిలుపునిచ్చారు.