Heatwave Alert: 51 మండలాల్లో రేపు తీవ్రవడగాలులు.. జర జాగ్రత్త.!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు.. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఎండ వేడిమికి వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే మంగళవారం రోజున 53 మండలాల్లో తీవ్రవడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వచ్చే రెండు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు ఆదివారం రోజున కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, నంద్యాల రూరల్ మండలంలో 42.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు ఆదివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క మండలానికి కూడా తీవ్రవడగాలుల హెచ్చరికను జారీ చేయలేదు. కానీ సోమవారం నాటికల్లా 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం నాటికి 53 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని.. బయటకు వెళ్లే సమయంలో టోపీలు, రుమాలు ధరించాలని సూచించారు. అలాగే ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన నెలకొంది.