అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన వేళ.. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ముదురుతున్నాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ నౌకదళాన్ని ఆదేశించారు. ఇదే సమయంలో ట్రంప్ ఆదేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు పూర్తి నియంత్రణ ఉందని.. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ ఆదేశించిన తర్వాత, ఇరాన్ భద్రతా దళాలు హర్మూజ్ జలసంధిని పూర్తి నియంత్రణలోకి తీసుకున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఏ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. శత్రువులు జలసంధిలోని సుడిగుండాలలో చిక్కుకునేలా చేస్తుందంటూ ఆమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు హర్మూజ్ జలసంధిని తెరుస్తామని వాగ్ధానం చేసిన ఇరాన్.. ఆ తర్వాత మాట తప్పందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ చర్యల కారణంగా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్న డొనాల్డ్ ట్రంప్.. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని స్పష్టం చేశారు. అలాగే హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. హర్మూజ్ జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా, అక్కడి నుంచి నిష్ర్కమించకుండా అమెరికన్ నౌకలు త్వరలోనే ఆపరేషన్‌ మొదలుపెడతాయంటూ ట్రూత్‌ సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్‌కు సుంకాలు చెల్లించే నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని.. అవసరమైతే వెంబడించాలని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌కు టోల్ చెల్లించే ఎవరికీ కూడా అంతర్జాతీయ జలాల్లో సురక్షితమైన ప్రయాణం ఉండదని ట్రంప్ వెల్లడించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. అలాగే హర్మూజ్ జలసంధిలోని మందుపాతర్లను కూడా ధ్వంసం చేస్తామని ట్రంప్ ట్వీట్ చేశారు. మరోవైపు ట్రంప్ ట్వీట్ చేసిన కాసేపటికే.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ కంట్రోల్‌లోనే ఉందని.. తప్పుడు చర్యలు తీసుకుంటే మాత్రం హర్మూజ్ జలసంధి సుడిగుండాలలో చిక్కుకుంటారంటూ అమెరికాను హెచ్చరించింది. మరి ముదురుతున్న ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనేదీ చూడాల్సి ఉంది.