విధి ఎంత బలీయమైనదని మనం అప్పుడప్పుడు కొన్ని ఘటనల్ని తలచుకుని చెప్పుకుంటాం. అవును కొందరి జీవితాల్లో విషాదాల గురించి ప్రస్తావించినప్పుడు సరిగ్గా ఇదే మాట గుర్తొస్తుంది. కీసర టోల్‌ప్లాజా దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీనియర్ లాయర్ జీవితంలో కూడా అలాంటి విషాదాలే జరిగాయి.. వీటి గురించి తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఆయన కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి.. ఆ బాధను మర్చిపోయి జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో శ్రీనిసరావు ఇలా ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరావు 10 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. కరోనా సమయంలో శ్రీనివాసరావు తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. అంతకముందు తన తమ్ముడ్ని కూడా కోల్పోయారు. శ్రీనివాసరావుకు ఒక కూతురు ఉన్నారు.. ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. తన కుమారుడి జ్ఞాపకాలు చెదిరిపోకుండా.. ఆ బాబు గదిని, అక్కడ వస్తువులను ఇప్పటికీ అలాగే భద్రపరిచారని సన్నిహితులు చెబుతున్నారు. ఆ గదిలోకి వెళ్ళిన ప్రతిసారీ తన కొడుకును చూసుకునేవారని అంటున్నారు. శ్రీనివాసరావు కోర్టులో సీనియర్ లాయర్‌గా తన వృత్తిని కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరావు అమరావతిలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆ ఇంటి ఈ పనులు పూర్తయితే ఇక హైదరాబాద్ ప్రయాణాలు ఉండవు.. అక్కడే ఉందామని భార్య, కుమార్తెతో పలు సందర్భాల్లో ప్రస్తావించారని సన్నిహితులు చెబుతున్నారు. పాపం ఆయన ఇంటి నిర్మాణ పనులు చూసుకుని వీకెండ్‌లో కుటుంబం దగ్గరికి వస్తుండగా ఫ్లైయాష్‌ ట్యాంకర్‌ రూపంలో ఆయన్ను మృత్యువు వెంటాడింది. పాపం ఎంతోమంది తరఫున పోరాటం చేసిన న్యాయవాదికి కాలం మాత్రం తీరని అన్యాయం చేసిందనే చెప్పాలి. శ్రీనివాసరావు ఇంట్లో మిగిలింది ఆయన అమ్మ, భార్య, కుమార్తె.. పాపం మూడు తరాల మగవాళ్లను ఆ కుటుంబం కోల్పోయింది. ఈ నెల 11న ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా దగ్గర ప్రమాదం జరిగింది. లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరారు. కీసర టోల్‌గేట్ దగ్గర కారు టోల్‌ కట్టేందుకు ఆగారు.. వెనుక వచ్చిన సిమెంట్ ఫ్లైయాష్‌ లోడుతో వెళ్తున్న లారీ ట్యాంకర్‌ కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఆయన చనిపోయారు. ట్యాంకర్‌ను తొలగించేందుకు చాలా సమయం పట్టింది.. ట్యాంకర్‌లోని లిక్విడ్‌ ఫ్లైయాష్‌ను మరో ట్యాంకర్‌లోకి మార్చారు. ఆ తర్వాత క్రేన్ల ద్వారా ట్యాంకర్‌ను పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంలో ధ్వంసమైన బీఎండబ్ల్యూ కారును కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌‌కు తరలించారు. ట్యాంకర్ అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. తాను నియంత్రించేందుకు ప్రయత్నించానని డ్రైవర్ ఆంటోని స్వామి అంటున్నారు.. ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.