శాంతి చర్చలు విఫలం.. భారీ నష్టాల్లోకి మార్కెట్లు.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం

Wait 5 sec.

Stock : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇరాన్- అమెరికా మధ్య సంధి చర్చలు విఫలమైన క్రమంలో పశ్చిమాసియాలో మళ్లీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ఈరోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1600 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 23,700 పాయింట్ల దిగువకు చేరడం గమనార్హం. ఏప్రిల్ 13వ తేదీ సోమవారం రోజున ఉదయం 9.23 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1600లకు పైగా పాయింట్ల మేర పతనమై 75,868 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1067 పాయింట్ల నష్టంతో 76,482 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఆరంభంలో భారీగా పడిపోయినా ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఆ తర్వాత 23,700 పాయింట్ల ఎగువకు చేరుకుంది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో నిఫ్టీ సూచీ 312 పాయింట్ల నష్టంతో 23,732 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ వంటి షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తర్వాత హార్ముజ్ జల సంధఇని దిగ్బంధించాలని తమ నేవీని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటనతో చమురు ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 7 శాతం పెరిగి 102 డాలర్ల పైకి చేరుకుంది. యూఎస్ క్రూడ్ ధర 104 డాలర్లు దాటింది. మరోవైపు ఇటీవల కాస్త కోలుకున్నట్లు కనిపించిన భారత కరెన్సీ రూపాయి విలువ తాజా పరిణామాలతో మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే 50 పైసలకు పైగా పడిపోయి 93.35 స్థాయిలో ట్రేడవుతోంది.