తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఉదయం 8 తర్వాత కాలు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఉదయం 10 తర్వాత రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండలతో పాటు భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి కాలం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా టార్చర్ హీట్‌వేవ్ కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతుండగా.. రానున్న వారం రోజులు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలు నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావటం మంచిది కాదని చెబుతున్నారు. హీట్ వేవ్స్ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. హైదరాబాద్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెబుతున్నారు. కాంక్రీట్ భవనాలు, వాహనాల రద్దీ వల్ల నగరంలో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కనిపిస్తోందని అంటున్నారు. వచ్చే వారం రోజుల పాటు నగరంలో వరుసగా 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. నగరవాసులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఇతర జిల్లాల్లో కూడా సగటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. తీవ్రమైన ఎండల దృష్ట్యా తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. బయటకు వెళితే.. గొడుగు లేదా టోపీ వంటివి ధరించాలి.దాహం లేకపోయినా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి లిక్విడ్ పదార్థాలు శరీరంలో డీహైడ్రేషన్ రాకుండా కాపాడతాయి.లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరానికి గాలి తగిలి వేడి తగ్గుతుంది.నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. అధిక ప్రోటీన్ ఉండే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అస్వస్థతగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.