ట్రంప్ సీజ్‌ ఫైర్.. క్రూడాయిల్ డౌన్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. లేటెస్ట్ జువెల్లరీ రేట్లు ఇవే..

Wait 5 sec.

Gold Price Surge: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల ఏం ప్రకటన చేసినా.. అంతర్జాతీయంగా పెను ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రకటనతో గోల్డ్ రేట్లు, క్రూడాయిల్ ధరలు, స్టాక్ మార్కెట్లు, ఇతర లోహాల ధరలు ఇలాంటివి అప్పటికప్పుడు పెరగడం లేదా వెంటనే తగ్గడం ఇలా జరుగుతున్నాయి. ట్రంప్ సుంకాలు విధించిన సమయంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో గతేడాది భారీగా పెరిగాయి. ఇటీవల ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం సమయంలో.. క్రూడాయిల్ ధరలు పెరగడంతో బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల మార్చి నెలలో భారీగా తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పుడు బంగారం ధరలు పెరిగేందుకు ప్రధాన కారణం.. ఇరాన్- అమెరికా యుద్ధం ముగింపుపై సంకేతాలు అందడమే. అవును.. ట్రంప్ రెండు వారాల పాటు సీజ్ ఫైర్‌ను (కాల్పుల విరమణ) ప్రకటించారు. హర్ముజ్ జలసంధిలో చమురు రవాణా సజావుగా సాగాలని ఆదేశించారు. దీనికి ఇరాన్ కూడా ఒప్పుకుంది. దౌత్యపరంగా చర్చలు కొనసాగిస్తూ.. హర్ముజ్ జలసంధిలో సాయుధ బలగాల పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగుతాయని పేర్కొంది. దీంతో. ఏప్రిల్ 7న బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లకుపైన ఉండగా.. ఏప్రిల్ 8న ఇది 90 డాలర్లకు పడిపోయింది. క్రూడాయిల్ తగ్గితే బంగారం ధర పెరుగుతుంటుంది. ఇదే సమయంలో యుద్ధం ముగింపుపై సంకేతాలు అందగా.. క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో.. డాలర్ డిమాండ్ తగ్గింది. ఇంకా ద్రవ్యోల్బణం భయాలు కూడా తొలగిపోయాయి. ఇది యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఊతం ఇస్తుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్ డిమాండ్ తగ్గి.. బంగారం ధరలు పెరుగుతుంటాయి. దీంతో ఇవాళ మళ్లీ గోల్డ్ రేట్లు పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లు పసిడివైపు మొగ్గుచూపి పెట్టుబడుల్ని పెట్టడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే లలితా జువెల్లరీలో 22 క్యారెట్లకు చెందిన గ్రాము గోల్డ్ రేటు కిందటి రోజుతో పోలిస్తే రూ. 365 పెరిగి రూ. 14,100 మార్కుకు చేరింది. కిందటి రోజు రూ. 13,735 వద్ద ఉంది. ఇక తులం ధర ప్రస్తుతం రూ. 1,41,000 వద్ద ఉంది. ఇతర జువెల్లరీల్లో చూస్తే టాటా ప్రొడక్ట్ తనిష్క్ జువెల్లరీలో గ్రాము పసిడి ధర రూ. 14,140 వద్ద కొనసాగుతోంది. ఖజానా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, జోయాలుక్కాస్, కళ్యాణ్ జువెల్లర్స్ వంటి చోట్ల గ్రాము గోల్డ్ రేటు రూ. 14,100 వద్దే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4630 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు అది 200 డాలర్ల వరకు పెరిగి 4,830 డాలర్లకు చేరింది. సిల్వర్ రేటు ఏకంగా 8 శాతం వరకు పెరిగి 78 డాలర్లకు చేరింది. దీనికి అనుగుణంగానే దేశీయంగా ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల తర్వాత రిటైల్ మార్కెట్లో ధరలు పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్లలో జోరు..ఇదిలా ఉండగా.. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో . ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో సెన్సెక్స్ 2800 పాయింట్లు పుంజుకొని 77,380 స్థాయిలో ఉంది. నిఫ్టీ 800 పాయింట్లకుపైగా పుంజుకొని 23,950 వద్ద కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల సంపద ఇవాళ ఒక్కరోజులోనే రూ. 15 లక్షల కోట్లకుపైగా పెరగడం విశేషం.