హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కల్చరల్ సెంటర్‌లో మంగళవారం జరిగిన చదరంగం పోటీల్లో ఒక బుడతడు సంచలనం సృష్టించాడు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ కుమారుడు శ్రేయాన్ష్‌ మురళీకృష్ణ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 2 ఏళ్ల 11 నెలల వయసు ఉన్న శ్రేయాన్ష్.. చెస్‌లో ఒకేసారి డబుల్ వరల్డ్ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. చెస్ బోర్డుపై అసాధారణ ఆటతీరును ప్రదర్శించిన శ్రేయాన్ష్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సహా పలువురు ప్రశంసలు గుప్పించారు. చిన్న వయసులోనే అత్యంత అరుదైన నైపుణ్యాలు ప్రదర్శించడాన్ని కొనియాడారు.తాజాగా జరిగిన చెస్ పోటీల్లో.. 15 నిమిషాల 52 సెకన్లలోనే శ్రేయాన్ష్‌.. 93 బ్యాక్‌ ర్యాంక్‌ చెక్‌మెట్స్‌ను పరిష్కరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక మరో విభాగంలో ఒక గంట 9 నిమిషాల 9 సెకన్లలో.. 21 చెస్‌ బోర్డులను అమర్చి.. ఇంకో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ 2 విభాగాల్లోనూ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(లండన్‌)లో 2 వరల్డ్ రికార్డులను దక్కించుకున్న అతి చిన్న వయసు కలిగిన బాలుడిగా శ్రేయాన్ష్ నిలిచాడు. ఈ ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. శ్రేయాన్ష్ వేగం, మేధస్సు అక్కడికి వచ్చిన వారిని ఎంతో ఆకట్టుకుంది. రాయ్‌చెస్‌ అకాడమీ ఫౌండర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉజ్వల్‌ చౌహాన్‌ జడ్జిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలు ముఖ్య అతిథులుగా హాజరై శ్రేయాన్ష్‌ను ప్రశంసించారు. అంత చిన్న వయసులోనే శ్రేయాన్ష్ ప్రపంచ రికార్డును నెలకొల్పడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌ పార్లమెంట్‌లో అవార్డు అందుకోనున్న శ్రేయాన్ష్‌ను వారు అభినందించారు. శ్రేయాన్ష్‌ సాధించిన విజయంతో తల్లి సుస్మిత పటేల్, అమ్మమ్మ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖ చేతుల మీదుగా శ్రేయాన్ష్‌కు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందించారు.మరోవైపు.. ఇదే శ్రేయాన్ష్ కొన్ని నెలల క్రితం.. లింగాష్టకం పఠించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 2 ఏళ్ల 10 నెలలకే భక్తితో పాడిన ఆ పాటకు రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే శ్రేయాన్ష్‌పై ప్రభాస్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఇతర పిల్లలకు శ్రేయాన్ష్ ఎంతో స్ఫూర్తి దాయకమని కొనియాడారు.