చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్యకేసు.. తప్పుడు సాక్ష్యం చెప్పిన 12మంది ఉద్యోగులపై చర్యలు

Wait 5 sec.

చిత్తూరు నగర మేయర్ దంపతులు కఠారి అనురాధ, మోహన్ హత్యకేసులో కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. అనురాధ, మోహన్ హత్యకేసు విచారణ సమయంలో తప్పుడు సాక్ష్యం చెప్పిన 14మందిపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు ఆరవ అదనపు జిల్లా కోర్టు ఇంఛార్జ్ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 14మందిలో 12మంది కార్పొరేషన్ ఉద్యోగులు కాగా, మరో ఇద్దరు కఠారి అనుచరులు. వీరిలో సీహెచ్ సురేష్ కుమార్, మల్లికార్జున్, బాలకృష్ణ, పద్మనాభ శెట్టి, ఆదాము, ఆనంద నాయుడు, మునిరత్నం, ముద్దు కృష్ణమ యాదవ్, దొరై రాజ్, త్యాగ రాజన్, గోపీనాథ్, ధనుంజయలు 12మంది కార్పొరేషన్ ఉద్యోగులు. మిగిలిన ఇద్దరు కె.కిరణ్‌కుమార్‌(కో-ఆప్షన్‌ సభ్యులు), జీకే వాసుబాబు(కఠారి అనుచరుడు). వీరిలో 12మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.ఈ 14మంది మేయర్ దంపతుల హత్యకేసును నీరుగార్చేలా కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇచ్చారంటూ న్యాయమూర్తి గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరందరిని ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ 14మంది నుంచి కోర్టు సంజాయిషీ కోరగా.. గతంలో కోర్టుకు హాజరై వారి సమాధానం ఇచ్చారు. అయితే కోర్టు వీరిచ్చిన సంజాయిషీపై సంతృప్తి చెందలేదు.. దీంతో తాజాగా వీరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరు నెలల్లోపు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 2015 నవంబరు 17న కార్పొరేషన్ కార్యాలయంలోనే తుపాకులతో కాల్చి, కత్తులతో నరికి హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 130 మందిని సాక్షులుగా పేర్కొనగా.. 57 మందిని కోర్టు విచారించింది. ఈ కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రదారి కఠారి మోహన్ అల్లుడు చింటూ సహా ఐదుగురిని మరణించే వరకు ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. చింటూకు రూ.70 లక్షలు జరిమానా విధించింది.. మిగిలినవారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా వేసింది. ఒకవేళ ఈ జరిమానా కట్టకపోతే ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పులో పేర్కొంది. ప్రధాన నిందితుడు చింటూ చెల్లించే డబ్బుల్లో రూ.50 లక్షలు మృతుల వారసులకు, మిగిలిన రూ.20 లక్షలు ఈ హత్యను ఆపేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలపాలైన సతీష్‌కుమార్‌కు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ హత్యకేసులో 14 మంది కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇచ్చారంట న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఎందుకు ప్రాసిక్యూట్‌ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా వీరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. మరి కలెక్టర్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.