Fall: భారత స్టాక్ మార్కెట్లలో కొంత కాలంగా ఒడుదొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికీ.. దిగ్గజ టాటా గ్రూప్‌కు చెందినటువంటి కొన్ని స్టాక్స్ మాత్రం దారుణంగా పతనం అవుతున్నాయి. మార్కెట్ లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా ఇక్కడ చాలా టాటా స్టాక్స్ గరిష్ఠ స్థాయిల నుంచి పెద్ద మొత్తంలో పతనం అయినవి ఉన్నాయి. వీటిల్లో తేజస్ నెట్‌వర్క్స్, ట్రెంట్, టాటా మోటార్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ కూడా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 5 లక్షల కోట్లకుపైగా క్షీణించింది. ఇప్పుడు మనం టాటా గ్రూప్.. రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, గ్రాసరీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రెంట్ లిమిటెడ్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రెంట్ షేరు.. ఒకప్పుడు ఇన్వెస్టర్లకు వెల్త్ క్రియేటర్‌గా ఉంది. 2024 సెప్టెంబర్ వరకు అంతా బాగానే నడిచింది. ఐదేళ్లలో ఊహించని రీతిలో రిటర్న్స్ అందించింది. 2023లోనే షేర్ ధర ఏకంగా 126 శాతం పెరిగింది. 2024లో 133 శాతం ఎగబాకింది. అక్కడి నుంచి పరిస్థితి మారిపోయింది. టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాలు బలహీనపడటం వల్ల ఈ స్టాక్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో గరిష్ఠ స్థాయిల నుంచి షేర్ ధర భారీగా కుదేలైంది. 2024, అక్టోబర్ 13న ట్రెంట్ షేర్ ధర ఏకంగా రూ. 8,345 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం ఏప్రిల్ 8 ఉదయం 8.50 గంటల సమయంలో ట్రెంట్ షేరు రూ. 3,815 గా ఉంది. ఈ క్రమంలో 17 నెలల వ్యవధిలో షేర్ ధర 55 శాతం వరకు పతనమైంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రికార్డు స్థాయిలో రూ. 1.60 లక్షల కోట్ల మేర నష్టాల్ని మిగిల్చింది. అదే స్థాయిలో కంపెనీ మార్కెట్ విలువ కూడా క్షీణించింది. 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి కూడా భారీగానే పడిపోయింది. 2025 జూన్ 30న రూ. 6,261 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. . కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 1.36 లక్షల కోట్లుగా ఉంది. ట్రెంట్ కంపెనీ.. జుడియో, వెస్ట్‌సైడ్ వంటి స్టోర్లను నిర్వహిస్తుండగా.. ఇటీవల ఇందులో దూకుడు పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనే జుడియో ఏకంగా 107 కొత్త స్టోర్లను తెరవగా.. మొత్తం స్టోర్ల సంఖ్య 957 కు చేరుకుంది. విస్తృతంగా స్టోర్ల సంఖ్యను పెంచింది. దానికి అనుగుణంగా వ్యాపారాలు నడవకపోవడమే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయగా.. అమ్మకాల ఒత్తిడితో స్టాక్ ధర ఈ స్థాయిలో పతనమైందని నిపుణులు చెబుతున్నారు. పలు బ్రోకరేజీలు ఈ క్రమంలోనే స్టాక్ టార్గెట్ ప్రైస్ కూడా తగ్గిస్తున్నాయి.గమనిక: పైన ఇచ్చింది కేవలం సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.