హైడ్రా మరో భారీ ఆపరేషన్.. రూ.1200 కోట్ల విలువైన భూములను రక్షించిన అధికారులు

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలో నాలాలు, చెరువులు, పార్కులు సహా ప్రభుత్వ భూములను కబ్జాకోరల నుంచి విడిపించేందుకు అధికారులు వరుసగా ఆపరేషన్లు చేపడుతూనే ఉన్నారు. ఆక్రమణల్లో ఏర్పాటు చేసిన గుడిసెల నుంచి మొదలుకుని భారీ నిర్మాణాలను కూడా బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కబ్జాదారుల భరతం పడుతున్న హైడ్రా అధికారులు.. ఆక్రమణలు చేయాలంటేనే భయపడేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తాజాగా హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టి.. 8 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమణల చెర నుంచి కాపాడారు. ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో ఏకంగా రూ.1200 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు.రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లంలోని ఖానామెట్ గ్రామంలో ఉన్న భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. స‌ర్వే నంబ‌ర్ 55లో ఉన్న 8 ఎక‌రాల‌కు పైగా ప్రభుత్వ భూమిని మంగ‌ళ‌వారం భారీ ఆపరేషన్ చేపట్టి.. హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఐటీ హబ్‌కి అతి దగ్గరలో ఉన్న ఈ భూమిని.. కొందరు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమించుకున్నట్లు గుర్తించారు. పలు నిర్మాణ సంస్థలు ఆక్రమించిన 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొల‌ను మాధ‌వ‌రెడ్డి కుమార్తె స‌బితకు చెందిన 4 ఎక‌రాల భూమిని కూడా హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ స్థలాల్లో తాత్కాలికంగా వేసిన షెడ్లను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో తొలగించారు. అదే సమయంలో ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన ఆర్‌సీసీ ప్లాంట్‌ను.. వాస‌వి నిర్మాణ సంస్థ స్వయంగా తీసేసింది. అంతేకాకుండా తమ సంస్థ నిర్మాణ కార్మికుల‌ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను కూడా హైడ్రా అధికారులు తొల‌గించారు. ఆ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 8.20 ఎకరాల‌ ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమ‌ణ‌లను తొల‌గించి బోర్డులు ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. ఒక్క మంగళవారం రోజున హైడ్రా రక్షించిన భూముల మార్కెట్ విలువ రూ. 1200ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ‌తంలో కూడా అదే ప్రాంతంలో ఉన్న ఆక్రమ‌ణ‌ల‌ను హైడ్రా అధికారులు తొల‌గించారు. స‌ర్వే నంబ‌రు 53లోని మొండికుంట ఆక్రమ‌ణ‌లు.. స‌ర్వే నంబ‌రు 55లోని 11 ఎక‌రాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది.మరోవైపు.. ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 55లో ఉన్న భూమి అసైన్డ్ ల్యాండ్‌ అని.. అది నిషేధిత జాబితాలో ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ ఉంచారు. కానీ ఆ భూమి తమ‌దే అని మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ క్లెయిమ్ చేస్తోంది. అందులో వాసవి నిర్మాణ సంస్థ ఆర్‌సీసీ ప్లాంటు ఏర్పాటు చేయడంతో పాటు.. కార్మికులకు షెడ్లను కూడా నిర్మించింది. ఈ క్రమంలోనే 4.20 ఎక‌రాల భూమిని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు త‌మ ఆక్రమణలో ఉంచుకున్నాయి. వీటికి తోడు ఇదే స‌ర్వే నంబ‌రులో ఉన్న మ‌రో 4 ఎక‌రాల భూమిని కొల‌ను స‌బిత త‌న‌దే అంటూ పేర్కొంటున్నారు. ఆ భూములకు కాప‌లాగా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ భూములపై ఫిర్యాదు అందడంతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల‌తో క్షేత్ర స్థాయిలో ఆయా శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి విచారణ జరిపి.. అది ప్రభుత్వ భూమే అని తేల్చి మంగ‌ళ‌వారం స్వాధీనం చేసుకున్నారు.