పొట్ట కూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి పనిచేసుకుంటున్న ఇద్దరు యువకులు.. తమాషా కోసం చేసిన పని.. అందులో ఒకరి ప్రాణాలనే హరించింది. ఇద్దరు యువకులు ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ అప్పటివరకు సరదాగానే ఉన్నారు. ఈ క్రమంలోనే అందులో ఒక వ్యక్తి చేసిన పని.. ఇంకో వ్యక్తి చనిపోయేలా చేసింది. కంపెనీలో ఉండే గాలి పైపును తీసుకుని.. ఒక వ్యక్తి తన ఫ్రెండ్ మల ద్వారంలో పెట్టాడు. సెకన్ల వ్యవధిలోనే గాలి మొత్తం అతడి శరీరంలోకి చేరడంతో.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేక మృత్యువాత పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పవన్ (20), సాయి(20) అనే ఇద్దరు స్నేహితులు.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట సమీపంలో ఉన్న విజయ నేహా కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆదివారం రోజున వీరిద్దరూ సరదాగా ఆడుకుంటున్నారు. ఆ కంపెనీలో ఉపయోగించే గాలి పైపును తీసుకున్న సాయి.. దాన్ని పవన్ మలద్వారం వద్ద ఉంచాడు. ఈ క్రమంలోనే 2 సెకన్లలో గాలి మొత్తం పవన్ శరీరంలోకి వెళ్లింది. దీంతో గాలి అంతా శరీరంలోకి చేరడంతో పవన్ ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన పవన్‌ను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున పరిస్థితి విషమించి పవన్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే పవన్‌ సోదరుడు అమన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు రాగా.. దీనికి సంబంధించిన వివరాలను సీఐ సీతారాం వెల్లడించారు.