ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 15 నుంచి దోస్త్‌ ప్రవేశాలు

Wait 5 sec.

ఇంటర్ పాసైన, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. తెలంగాణలో రానున్న 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నెల 15 నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు నేడు షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇప్పటివరకు ఒకవైపు చదువుకుంటూ...మరో వైపు ఇంటర్న్‌షిప్‌ చేస్తూ సంపాదించే అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఏఈడీపీ)లను పెద్దసంఖ్యలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వాటిల్లో 3600 వరకు సీట్లు ఉండగా.. మరో 1800 సీట్లు భర్తీ కానున్నాయి. ఏఈడీపీలో విద్యార్థులు చేరే విధంగా.. వారికి మరింత అవగాహన కల్పించి ఇంటర్న్‌షిప్‌తో పాటు స్టైపెండ్‌ ఇవ్వాలని కళాశాల విద్యాశాఖ తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీట్ల సంఖ్యను దాదాపు 11 వేలకు పెంచాలని భావిస్తోంది. ఇందులో కనీసం 8 వేల సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు చేపట్టాలని కళాశాల విద్యాశాఖ టార్గెట్‌గా పెట్టుకుంది.ఇంటర్ ఫలితాలు విడుదల..ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఆదివారం ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సంయుక్తంగా ఫలితాల సీడీని విడుదల చేశారు. కోవిడ్ అనంతర విద్యా సంవత్సరాల్లో ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 75.61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. ఎప్పటిలాగే అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 66.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 70.52 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టాప్ ర్యాంకులు, గరిష్ఠ మార్కులను అమ్మాయిలే కైవసం చేసుకోవడం విశేషం. ముఖ్యంగా సైన్స్, కామర్స్ విభాగాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. రీ-వెరిఫికేషన్, సప్లిమెంటరీ వివరాలుఫలితాల్లో మార్కుల పట్ల సంతృప్తి లేని విద్యార్థులకు బోర్డు రీ కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ఫీజు చెల్లింపు గడువు, దరఖాస్తు విధానాన్ని బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. అలాగే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యార్థులు తమ కళాశాలల్లో సంప్రదించి గడువులోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.