'బింబిసార' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన మల్లిడి వశిష్ట.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. సోషియో ఫాంటసీ కథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించగలరని డెబ్యూతోనే నిరూపించుకున్నారు. అందుకే మెగాస్టార్ పిలిచి మరీ అదే జోనర్ లో 'విశ్వంభర' సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోవైపు డైరెక్టర్ వశిష్ట మధ్య మధ్యలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రమోషన్స్ చేస్తున్నారు.వశిష్ట ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో 'విశ్వంభర' సినిమా గురించి మాట్లాడారు. చిరంజీవితో ఎలాంటి సినిమా చేద్దామా అనే ఆలోచనలో, ఇటీవల కాలంలో ఆయన టచ్ చేయని జోనర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా నుంచే ఈ కథ పుట్టిందని తెలిపారు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన జోనర్ లో మూవీ చేయాలని అనుకున్నానన్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అంజి' తర్వాత చిరు సోషియో ఫాంటసీ మూవీ చేయలేదు కాబట్టి, అటువంటి డిఫరెంట్ కథ రెడీ చేసుకున్నానని తెలిపారు. 90స్ కిడ్స్ కి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ఫేవరేట్ అని, తనకు అవకాశం వస్తే చిరంజీవితో అలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, లక్కీగా రెండో సినిమాకే కుదిరిందని దర్శకుడు వశిష్ట అన్నారు. సినిమాలో ఫాంటసీతో పాటుగా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుందని చెప్పారు. 'విశ్వంభర' రిలీజుకు ఇంకా చాలా టైమ్ ఉందని, రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్కటొక్కటిగా సీక్రెట్స్ అన్నీ రివీల్ చేసుకుంటూ వస్తామని తెలిపారు. చిరంజీవి సినిమాలు చూస్తే పెరిగిన తనకు ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు.* ఏదైనా సినిమా బయటకు వచ్చిన తర్వాతే మిస్టేక్స్ అనేవి తెలుస్తాయని, వాటిని యాక్సెప్ట్ చేయాలని, నేను తీసిందే కరెక్ట్ అనే ధోరణిలో ఉండకూడదని వశిష్ట పేర్కొన్నారు. డైరెక్టర్ గా ఒక కథను నమ్మి సినిమా చేస్తామని, అది రిలీజైన తర్వాత ప్రేక్షకుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయని, కానీ మనం ఫస్ట్ ఏదైతే కథను నమ్మి చేశామో దాన్ని అనుకున్న విధంగా ఫినిష్ చేయాలన్నారు. ఎవరు చెప్పినా తాను రాసుకున్న స్క్రిప్ట్ మార్చడానికి ఇష్టపడనని వశిష్ట తెలిపారు. కొత్త ఐడియా వచ్చిన ప్రతీసారి మార్చుకుంటూ పోతే అది కిచిడీ అయిపోతుందన్నారు. “ఎప్పుడైనా ఫస్ట్ ఐడియా ఈజ్ బెస్ట్ అంటారు. ఎందుకంటే అది పొల్యూట్ అవకుండా బయటకు వస్తుంది. ఆ తర్వాత దాని మీద డిస్కషన్ చేస్తున్న క్రమంలో కరెక్షన్స్ చేయడం మొదలవుతుంది. అలా చేసుకుంటూ పోతే దానికి ఎండ్ ఉండదు. ఎప్పుడైతే ఒక ఐడియా లాక్ అవుతుందో, దాన్ని అలానే ఉంచి ఎలా బెటర్ గా చేయొచ్చు అనేది ఆలోచించాలే తప్ప, ఐడియా వచ్చిన ప్రతీసారి దాన్ని మార్చుకుంటూ పోతే లాస్ట్ కి కిచిడీ అయిపోతుంది. రిజల్ట్ ఇంకో రకంగా ఉంటుంది. ఫస్ట్ మనం అనుకున్న దాన్ని మనం నమ్మాలి” “దేవుడి దయ వల్ల ‘బింబిసార’ సినిమాకి ఫస్ట్ ఏమనుకున్నానో లాస్ట్ దాకా అలానే ఉన్నాం. ‘విశ్వంభర’ సినిమా లాక్ చేసిన తర్వాత మొదటి రోజు ఎలా ఉందో, చివరి రోజు కూడా అలానే ఉంది. మధ్యలో ఏవైనా కొన్ని డైలాగ్స్ మార్చడం జరిగిందే తప్ప, మిగతా ఏమీ చేంజ్ చేయలేదు. ఎందుకంటే ఆ కథను నమ్మే మేము ఆ సినిమా చేశాం. అప్పుడు నమ్మిన కథ మధ్యలో ఎందుకు మారిపోతుంది?. అయితే ఈ విషయంలో ఒక్కో దర్శకుడు ఒక్కోలా ట్రీట్ చేస్తుంటారు. కొందరు ఆన్ ది స్పాట్ రాసుకుంటూ వెళ్తారు. అది వాళ్ల స్ట్రెంత్. అది తప్పు ఒప్పు అని నేను చెప్పడం లేదు. కానీ నేను మాత్రం ఇలా ట్రీట్ చేస్తుంటా. ఒక్కసారి కథ లాక్ అయిన తర్వాత మార్చకూడదు అనేది నా పద్ధతి” అని వశిష్ట అన్నారు.* మ్యూజిక్ టేస్ట్ గురించి వశిష్ట మాట్లాడుతూ.. “పాట బాగుందా బాగాలేదా అనేది చెప్పడం తప్ప, ఈ పాట ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే నాలెడ్జ్ మనకు లేదు. మ్యూజిక్ డైరెక్టర్ ని నమ్మి వాళ్లు ట్యూన్స్ ఇచ్చిన తర్వాత, బాగుందా బాగాలేదా అనేది చెప్పాలే తప్ప, మన విజ్ఞాన ప్రదర్శన వాళ్ల దగ్గర చూపించకూడదు. నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఎవరో వచ్చి నా పని చేస్తే నాకు కోపం వస్తుంది. నా పని నేను చెయ్యాలి.. అతని పని అతను చెయ్యాలి. అలానే మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ కూడా వాళ్ల పని వాళ్లు చేస్తారు” అని అన్నారు.విశ్వంభర ప్రమోషన్స్ లో భాగం వశిష్ట ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ పాతదే అయినప్పటికీ, ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొరటాల శివ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఎవడి పని వాడు చేస్తే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. పక్కనోడి పనిలో చెయ్యి దూర్చి ఆయన్ని ఇబ్బంది పెట్టి, మన పని మనం చెయ్యక” అని వ్యాఖ్యానించారు. వశిష్ట చెప్పిన దానికి కొరటాల ఇంటర్వ్యూని లింక్ చేస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.