హైదరాబాద్ మార్గంలో విమాన ఛార్జీలు అధికంగా ఉన్నాయని.. దయచేసి వీటిని తగ్గించాలంటూ మద్దెల గురుమార్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎక్కువగా ఉండటంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ రూట్లో విమాన ఛార్జీలు తగ్గించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి గురుమూర్తి లేఖ రాశారు. విమాన ఛార్జీలను తగ్గించటంతో పాటుగా హైదరాబాద్ - తిరుపతి మార్గంలో విమాన సర్వీసులు పెంచాలని గురుమూర్తి కోరారు. హైదరాబాద్ - తిరుపతి మార్గంలో విమాన ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయన్న గురుమూర్తి.. మిగతా దేశీయ రూట్లతో పోలిస్తే ఛార్జీలు అధికంగా ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రయాణికుల డిమాండ్ ఉన్నప్పటికీ ఛార్జీలలో వ్యత్యాసం ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు తిరుపతికి వస్తుంటారని.. హైదరాబాద్ - తిరుపతి విమాన ప్రయాణికుల్లో ఎక్కువ శాతం భక్తులు, సీనియర్ సీటిజన్లు, మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయని వివరించారు. గతేడాది కాలంలో విమాన ఛార్జీలను పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి గోవాకు రూ.3000 - రూ.6500 మధ్యన, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ.3900 - రూ.7000, హైదరాబాద్ - ముంబై విమాన ఛార్జీలు రూ.3900 - రూ.6000, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.2800 - రూ.4700, హైదరాబాద్ నుంచి చెన్నై విమాన ఛార్జీలు రూ.2500 - రూ.4000 మధ్యలో ఉన్నాయని గురుమూర్తి వివరించారు. అయితే హైదరాబాద్ - తిరుపతి మార్గంలో మాత్రం నాన్ స్టాప్ విమాన ఛార్జీలు సగటున రూ.6000 నుంచి రూ.9500 వరకూ ఉన్నాయని.. అలాగే బడ్జెట్ ఛార్జీలు 5,100 నుంచి రూ.5900 మధ్యన ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఒక్కోసారి విమాన ఛార్జీలు రూ.14500 వెళ్తున్నాయని ఎంపీ వివరించారు. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 మధ్య 13,367 విమాన సర్వీసుల ద్వారా.. 11,84,355 మంది ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణించారని గురుమూర్తి వివరించారు. గత నెలలోనే 864 విమాన సర్వీసుల ద్వారా 88,405 మంది ప్రయాణికులు ప్రయాణించారని అన్నారు. డిమాండ్ ఇంతగా ఉన్నప్పటికీ ఛార్జీలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని కేంద్రానికి గురుమూర్తి వివరించారు. ఇదే సమయంలో పెద్ద విమానాల బదులుగా చిన్న విమాన సర్వీసుల వాడకం పెరిగిందని.. దీంతో విమాన ఛార్జీలు పెరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తిరుపతి ప్రాముఖ్యత, ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్-తిరుపతి మార్గంలో విమాన ఛార్జీల విధానాలను సమీక్షించి, హేతుబద్ధీకరించాలని గురుమూర్తి కోరారు. ఈ మార్గంలో విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని, సీటింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉన్న విమానాలను వినియోగించాలని గురుమూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు.