పీపీఎఫ్ అకౌంట్‌ను ఎన్నిసార్లు పొడిగించుకోవచ్చు.. ఎంత జమ చేస్తే వడ్డీ ఎంతొస్తుంది.. లెక్కలివే!

Wait 5 sec.

PPF Scheme Interest Rate: పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ పథకం ఎంచుకోవాలి.. ఎప్పుడు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టాలనే దానిపై సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఏదేమైనా ఇక్కడ మాత్రం ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్రం హామీ ఇస్తున్న కారణంగా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. నిర్దిష్ట పెట్టుబడులపై నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి.. నిర్ణీత కాల వ్యవధికి రాబడి వస్తుంది. పోస్టాఫీస్ పథకాల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ వార్షిక వడ్డీ రేటు ప్రస్తుతం 7.10 శాతంగా ఉంది. అయినప్పటికీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా దీర్ఘకాలంలో రాబడి అధికంగా వస్తుందని చెప్పొచ్చు. ఈ స్కీమ్ విషయానికి వస్తే కాల పరిమితి 15 ఏళ్లు. అంటే వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షలుగా ఉంది. ఇక్కడ పెట్టుబడి, వడ్డీ రాబడి, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై టాక్స్ ఉండదు. పాత పన్ను విధానంలోనే.. పూర్తిగా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తూ పోయినా లాంగ్ రన్‌లో పెద్ద మొత్తం రాబడి అందుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే ఇక్కడ టెన్యూర్ 15 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. దీన్ని మరికొంత కాలం పొడిగించుకునేందుకు వీలు పడుతుంది. అయితే ఎంత కాలం పొడిగించుకోవచ్చు.. ఎంత మొత్తం సమకూరుతుందనేది తెలుసుకుందాం. పీపీఎఫ్ అకౌంట్.. 15 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఇక్కడ గడువు తర్వాత మూసేయొచ్చు. అవసరమైతే ఇంకా పొడిగించుకునేందుకు కూడా వీలుంటుంది. ఐదేళ్ల చొప్పున ఎన్నిసార్లయినా పొడిగించుకోవచ్చు. అంటే 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు ఇలా కంటిన్యూ చేయొచ్చు. అకౌంట్ ఎక్స్‌టెన్షన్ కోసం మెచ్యూరిటీకి సంవత్సరంలోపే పొడిగింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మరో ఆప్షన్ ఉంటుంది. పొడిగించే కాలానికి డిపాజిట్ చేయొచ్చు లేదా చేయకుండా కూడా కంటిన్యూ చేయొచ్చు. వడ్డీ, రాబడి గమనిస్తే.. పీపీఎఫ్ ఖాతాలో జమయ్యే మొత్తంపై వడ్డీ 7.10 శాతంగా ఉంది. ఇక 15 ఏళ్ల పాటు గరిష్ఠ డిపాజిట్ మొత్తం రూ. 1.50 లక్షల చొప్పున జమ చేస్తే.. మెచ్యూరిటీకి అంటే 15 ఏళ్లకు రూ. 40.68 లక్షలు వస్తుంది. దీంట్లో వడ్డీతోనే రూ. 18 లక్షలకుపైగా వస్తుంది. పొడిగింపు విషయానికి వస్తే.. ముందుగా మీరు ఈ అకౌంట్‌ను ఐదేళ్లు పొడిగిస్తూ అప్పుడు కూడా ఏటా రూ. 1.50 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌ పెడితే 20 ఏళ్ల తర్వాత చేతికి సుమారు రూ. 67 లక్షలు వస్తాయి. ఇంకో ఐదేళ్లు అంటే 25 ఏళ్ల వరకు అకౌంట్ కొనసాగిస్తే రూ. 1.03 కోట్లు వస్తాయి.ఇంకా మెచ్యూరిటీ తర్వాత డబ్బులు డిపాజిట్ చేయకుండా కూడా ఖాతా కొనసాగించవచ్చు. అప్పుడు డిపాజిట్ చేయకుండా మరో ఐదేళ్ల పాటు అకౌంట్ కొనసాగిస్తే అసలు, వడ్డీ కలిపి 20 ఏళ్లకు రూ. 57 లక్షలకుపైగా వస్తుంది. పొడిగించిన ఐదేళ్లలో వడ్డీ రూ. 16 లక్షల వరకు వస్తుంది. ఇదే 25 ఏళ్లకు చూస్తే రూ. 80 లక్షల వరకు సమకూరుతుంది.