హైదరాబాద్ నగరం అంటేనే అద్భుతమైన కట్టడాలకు నిలయం. చార్మినార్, గోల్కొండ మెుదలు.. ఐటీ కారిడార్‌లో ఆకాశాన్ని తాకే భవనాలు, జిగేల్‌మనే కేబుల్ బ్రిడ్జి ఇలా ఎన్నో కట్టడాలు నగరానికి మణిహారంలా ఉన్నాయి. వాటిని చూసి మురిసిపోయే లోపే.. నవ్వుల పాలు చేస్తోంది. ఆ స్కైవాక్ నిర్మాణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి ముగ్గురిలో ఒక ఇంజనీర్ ఉన్న దేశంలో.. ఇలాంటి వింతైన నిర్మాణం జరగడం చూస్తుంటే ఇది ఇంజనీరింగ్ అద్భుతమా? లేక ప్రపంచ ఎనిమిదో వింత అనే సందేహం కలగక మానదు. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం జంక్షన్ వద్ద పాదచారుల కష్టాలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన స్కైవాక్ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 390 మీటర్ల పొడవు కలిగిన ఈ స్కైవాక్ కోసం దాదాపు 33 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించారు. ఇది రైతు బజార్ వైపు నుంచి మొదలై.. డిఫెన్స్ ఏరియా మీదుగా బస్ స్టాప్ వరకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు.నిర్మాణం పూర్తయి.. అందుబాటులోకి వస్తున్న తరుణంలో స్కైవాక్ డిజైన్ చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అప్పటికే ఆ మార్గంలో ఉన్న ఫ్లైఓవర్ ఉండగా.. దాని కింద నుంచి ఈ స్కైవాక్ నిర్మించారు. అయితే ఫ్లైఓవర్ తప్పించటం కోసం స్కైవాక్ డిజైన్ మార్చారు. దీంతో సాధారణ పౌరులు నడవడానికి కాకుండా.. కమెండోల శిక్షణ కోసం దీనిని కట్టినట్టు ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేస్తున్నారు. 'ఈ బ్రిడ్జి డిజైన్ చేసిన వారు ఎప్పుడైనా నడిచారా? లేక కేవలం కాగితాల్లో గీసి కోట్లు జేబులో వేసుకున్నారా?' అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని.. డిజైన్ చేసిన ఇంజనీర్లకు నిజంగా గొప్పవారని సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఈ స్కైవాక్ పనులు 2022 ప్రారంభం అయినప్పటికీ డిఫెన్స్ స్థలాల సేకరణ, ఇతర సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. 2024-25 నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దకుండా దీనిని ప్రారంభిస్తే అది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ కట్టడం, ట్రాఫిక్ చిక్కులను తీర్చి పాదచారులకు రక్షణ కల్పించాల్సింది పోయి.. వారికే సవాలుగా మారడం దురదృష్టకరమని అంటున్నారు. అధికారులు స్పందించి కనీసం ఇప్పుడైనా అందులోని లోపాలను సరిదిద్ది.. సామాన్యుడు సులభంగా నడిచేలా మార్పులు చేయాలని కోరుతున్నారు.