కష్టకాలంలో TCS షాకింగ్ నిర్ణయం.. ఈ ఏడాది ఫ్రెషర్ల నియామకాల్లో భారీ కోత.. ఐటీ కోలువులపై నీలినీడలు!

Wait 5 sec.

TCS Hiring: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఐటీ రంగంలో ఒడుదొడుకులకు కారణమవుతున్నాయి. వ్యయాల నియంత్రణతో ప్రాజెక్టులు తగ్గడంతో ఐటీ, టెక్ కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో అమెజానా, మెటా వంటి కంపెనీలు మళ్లీ లేఆఫ్స్ వైపు మళ్లుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ లోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ, టాటా గ్రూప్ సాధారణంగా ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ఈ ఐటీ దిగ్గజం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026- 27లో తన నియామక లక్ష్యాలను గణనీయంగా తగ్గించుకుంది. దీంతో ఐటీ కొలువులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కంపెనీ వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ కేవలం 25,000 మంది ఫ్రెషర్లకు మాత్రమే ఆఫర్లు ఇవ్వనుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు సగానికి తగ్గనుంది. అలాగే రానున్న రోజుల్లో అదనపు నియామకాలు మార్కెట్ డిమాండ్, ప్రాజెక్టలపై రాకపై ఆధారపడి ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ఐటీ రంగంలో నెలకొన్న పరిస్థితులపై కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కే క్రితివాసన్ మాట్లాడారు. ' మేము ఈ ఏడాది 25 వేల మంది ఫ్రెషర్ల నియామకాలు చేపట్టనున్నాము. పరిస్థితులు మారుతున్న కొద్దీ, డిమాండ్ పెరిగితే తదుపరి నియామకాలపై నిర్ణయం తీసుకుంటాము' అని తెలిపారు. అంటే గతంలో మాదిరిగా ముందస్తుగానే భారీ లక్ష్యాలను పెట్టుకోకుండా అవసరాన్ని బట్టి మాత్రమే నియామకాలు చేపట్టాలని టీసీఎస్ భావిస్తోంది. ఇప్పటికే కంపెనీలో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించడం, టెక్ పరిశ్రమలో తదుపరి త్రైమాసికాలపై స్పష్టత లేకపోవడంతో కంపెనీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గించినట్లు అర్థమవుతోంది. గత ఏడాది 46000 మంది ఫ్రెషర్లను నియమించుకోగా ఆ సంఖ్యను 25000 లకు తగ్గించడం గమనార్హం. గడిచిన మూడు సంవత్సరాలుగా సగటున 40 వేలకు పైగా ఫ్రెషర్లను తీసుకుంటోంది. ఎప్పుడూ వేలాది మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆశాదీపంగా ఉండే టీసీఎస్ ఇప్పుడు తక్కువ నియామకాలు అనే మార్గాన్ని ఎంచుకోవడం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయం ఇతర ఐటీ కంపెనీల పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకలు భావిస్తున్నారు.