IPLలో పెద్ద వివాదం.. రాజస్థాన్ డగౌట్‌లో ఫోన్‌, కెమెరాల్లో పట్టుబడ్డ వైనం, బీసీసీఐ సీరియస్!

Wait 5 sec.

గువాహటి వేదికగా - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భీందర్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో యాంటీ కరప్షన్ నిబంధనలు ఉల్లంఘించాడనే ప్రశ్నలు మొదలయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో రాజస్థాన్ మేనేజర్ భీందర్, వైభవ్ సూర్యవంశీ పక్కనే కూర్చొని ఫోన్ వాడుతున్న విజువల్స్ బయటకు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఈ వివాదం పెద్ద చర్చకు దారి తీసింది. తొలుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత బీసీసీఐ సెక్యూరిటీ టీమ్ చెక్ చేసి నిజమేనని నిర్ధారణ చేసింది. దాంతో బీసీసీఐ సీరియస్ అయింది. ఈ వివాదంపై స్పందించిన బీసీసీఐ అధికారులు.. ప్లేయర్లు, అంపైర్లు ఉండే ఏరియాలో మొబైల్ ఫోన్ పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్ డ్రస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ వినియోగించాలి. కానీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో అస్సలు వాడకూడదు. ఈ ఘటనను బోర్డు వర్గాలు కూడా సీరియస్‌గా తీసుకున్నాయి. మేనేజర్ భీందర్ ఇది కావాలనే చేశాడా? లేక ఏదో పొరపాటున జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. తెలియక చేసినా కూడా ఇది నిబంధనలను ఉల్లంఘించడం కిందే వస్తుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. "ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. హెచ్చరిక కానీ, మ్యాచ్‌కు దూరం చేసే శిక్ష ఏదోకటి చేయాలి. తుది నిర్ణయం మాత్రం మ్యాచ్ రిఫరీ, యాంటి కరప్షన్ యూనిట్ నివేదిక ఆధారంగా ఉంటుంది" అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇక ఈ ఘటనపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ రంగంలోకి దిగనుంది. భీందర్‌పై నివేదిక సమర్పించిన తర్వాత ఏ చర్చలు తీసుకోవాలి అనేది ఫైనల్ కానుంది. జరిమానా కానీ, తాత్కాలిక సస్పెన్షన్ కానీ ఉండే అవకాశం ఉంది. లలిత్ మోదీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ మ్యాచ్ సమయంలో యాంటీ కరప్షన్ అధికారులు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకునే తుది నిర్ణయం అందరిలో ఆసక్తి రేపుతోంది.