సల్కం చెరువులో ఓవైసీ విద్యాసంస్థలు.. సొంత రిస్క్‌పైనే అడ్మిషన్లు తీసుకోండి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కీలక సూచన చేసింది. ఈ విద్యా సంస్థ నిర్మాణాల విషయమై పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, వారి పేరెంట్స్ తమ సొంత రిస్క్‌పైనే అడ్మిషన్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. విద్యాసంస్థకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్పుడు ఎలాంటి హక్కులు కోరలేరని స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థుల భవితవ్యం కూడా తుది తీర్పుకు లోబడే ఉంటుందని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఈ విద్యా సంస్థను అక్రమంగా నిర్మించారని దీనిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని అడ్వకేట్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నగరంలో 26 చెరువులుండగా.. కేవలం సల్కం చెరువుకు మాత్రమే ఎఫ్‌టీఎల్ ఖరారు చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్థాపించిన 'సలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే.. ఈ సంస్థ చెరువు మధ్యలో, బఫర్ జోన్‌లో నిర్మించినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.విద్యా సంస్థపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని మేనేజ్‌మెంట్ తమ నోటీసు బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. దాంతో పాటు సల్కం చెరువు పరిధిలో ఇకపై ఎలాంటి అదనపు నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుండి ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరంపై కోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వులు ప్రభావం చూపుతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఒవైసీ ఫాతిమా కాలేజీ సల్కం చెరువులో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నా.. దానిపై చర్యలు తీసుకోలేదు. ఇదే విషయమై సోషల్ మీడియా తదితర మాధ్యమల్లో హైడ్రాని పలువురు ప్రశ్నించారు. దీంతో గతంలోనే క్లారిటీ ఇచ్చారు. సల్కం చెరువు ఎఫ్టీఎల్‌లో నిర్మించిన ఫాతిమా కాలేజ్ తొలగిస్తామని గత సెప్టెంబర్‌లో ప్రకటించామని చెప్పారు. అయితే పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థ ఇక్కడ నడుస్తోందని అన్నారు. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని.. 10 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పారు.