బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, ప్రమాదాలలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అలాగే గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్కుల వరద నీరు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు వివరించారు.మరోవైపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలతో నలుగురు చనిపోవటంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నాలుగేసి లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. విశాఖపట్నం కంచరపాలెంలో ఒకరు. శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒక వ్యక్తి వర్షాలు, ప్రమాదాలలో చనిపోయారు. మరోవైపు భారీ వర్షాలతో కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అయితే ఇప్పటికే 90 శాతం చోట్ల కూలిన చెట్లను అధికారులు తొలగించారు. సుమారు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను తిరిగి ఏర్పాటు చేశారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో వంశధారలోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో గొట్టా బ్యారేజీ నుంచి 1.04లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వంశధార నదీపరివాహక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాలతో విజయనగరం జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. బొబ్బిలి, భోగాపురంలలో భారీగా అరటి పంట నేలమట్టమైంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ భారీగా పంటనష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.