కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి అధికార బీజేపీకి అస్త్రాలుగా మారాయి. ప్రస్తుతం కొలంబియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. అక్కడ విద్యార్థులతో సమావేశమై చేసిన వ్యాఖ్యలు భారతదేశ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ సందర్భంగా.. రాహుల్ ఒక సాధారణ ప్రశ్న వేశారు. దానికి ఆయనే ఇచ్చిన సమాధానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బైక్ 100 కిలోలు ఉంటే.. కారు 3 వేల కిలోలు ఎందుకు ఉంటుందని ప్రశ్నించిన రాహుల్ గాందీ.. ఆ తర్వాత దానికి ఆయన సమాధానం ఇచ్చారు. ఒక వ్యక్తి ప్రయాణించడానికి 3 వేల కిలోల బరువు ఉన్న కారు అవసరం అవుతుంది. కానీ అదే సమయంలో ఒక 100 కిలోల బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. మరి 100 కిలోల బైక్ ఇద్దరిని తీసుకెళ్లగలిగితే.. కారుకు 3 వేల కిలోలు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. అయితే దానికి ప్రధాన కారణం ఇంజిన్‌లోనే ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కారుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. దాని ఇంజిన్ కారు లోపలికి వెళ్తుందని.. అయితే ఆ ఇంజిన్.. అందులో ప్రయాణించే వారిని చంపకుండా ఉండేదుకు.. కారును భారీ పరిమాణంతో, పటిష్టంగా రూపొందిస్తారని రాహుల్ తెలిపారు. కానీ బైక్‌పై వెళ్లినపుడు ఏదైనా ప్రమాదం జరిగితే.. బైక్‌పై నుంచి పడిపోవడం వల్ల ఇంజిన్ కారణంగా ఎలాంటి హానీ ఉండదని వివరించారు.కారు ఇంజిన్ సమస్యకు పరిష్కారం ఎలక్ట్రిక్ మొబిలిటీ అని రాహుల్ గాంధీ సూచించారు. సాంప్రదాయ ఇంజిన్ అనేది కేంద్రీకృత శక్తి వ్యవస్థ అని.. కానీ ఎలక్ట్రిక్ మోటార్ ఆ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎలక్ట్రిక్ మోటార్లను ఒకటి ఒకచోట.. మరొకటి ఇంకోచోట.. ఇలా వేర్వేరు చోట్ల అమర్చుతారని పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ మోటార్ అనేది శక్తి వికేంద్రీకరణను సూచిస్తుందని.. దాని ప్రభావం నిజంగా ఇదేనని ఆయన వివరించారు.అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ టెక్నాలజీ వివరణపై బీజేపీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ వెంటనే స్పందించారు. తాను ఇంత అర్థం లేని వాదనను ఒకేసారి వినలేదని.. రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకుంటున్నారో ఎవరైనా డీకోడ్ చేయగలిగితే.. తాను సంతోషిస్తానని పేర్కొన్నారు. కానీ తనలాగే మిగితా వారు కూడా ఆశ్చర్యపోతే.. వారు కూడా తన లాంటి వారేనని నిర్ణయించుకోండి అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.మరోవైపు.. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్య కేవలం ఆటోమొబైల్ వివరణ మాత్రమే కాదని అర్థం అవుతోంది. పరోక్షంగా ఇది రాజకీయపరమైన సూచన అని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ నాగాలాండ్‌లో విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. రాజకీయాల్లో అధికారాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సాంప్రదాయ ఇంజిన్లు కేంద్రీకృత శక్తి వనరులు, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో శక్తి వికేంద్రీకృతం అవుతుందని తెలిపారు. బ్యాటరీలు, మోటార్‌లు మొత్తం కారు డిజైన్‌ను మారుస్తాయని వ్యాఖ్యానించారు. శక్తి వికేంద్రీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ నుంచి రాజకీయాల వరకు ప్రతిదాన్ని మారుస్తుందని రాహుల్ గాంధీ పేర్కొంటున్నారు.