అమర జవాన్ సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. బహుమతిగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌, అద్భుత దృశ్యం

Wait 5 sec.

సరిహద్దుల్లో శత్రువులపై యుద్ధం చేయడమే కాకుండా.. అలాంటి యుద్ధాల్లో అనాథలైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు కూడా భారత సైనికులు నడుం బిగించి.. ముందడుగు వేసిన సంఘటనలు మనం ఇప్పటివరకు ఎన్నో చూశాం. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర సైనికుల కుటుంబాలకు.. ఇండియన్ ఆర్మీ అండగా ఉంటుంది అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షించే క్రమంలో వీరమరణం పొందిన ఓ సైనికుడి చెల్లెలి పెళ్లిలో భారత సైనికులు ఆమె అన్న పాత్రను పోషించి.. అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక పర్వత ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో.. సైనికుల అపూర్వమైన ఆదరణ చూసి వధువు, ఆ పెళ్లికి వచ్చిన అతిథులు కన్నీరు పెట్టుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఆపరేషన్ అలర్ట్‌లో భాగంగా విధి నిర్వహణలో ఉండగా.. ఆశిష్ కుమార్ అనే సైనికుడు వీర మరణం పొందారు. ఆశిష్ కుమారి సోదరి ఆరాధన వివాహం సిర్మౌర్ జిల్లాలోని భర్లి గ్రామంలో జరిగింది. అయితే ఆరాధన పెళ్లి అంతా సజావుగానే సాగినా.. తన అన్న ఆశిష్ కుమార్ లేని లోటు మాత్రం ఆమెను, ఆమె కుటుంబాన్ని వెంటాడింది. సరిగ్గా అదే సమయంలో.. ఆశిష్ కుమార్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు, కొందరు మాజీ సైనికులు (పాంటా, షిల్లాయి ప్రాంతాలకు చెందినవారు) పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.వధువుకు అన్న చేయాల్సిన బాధ్యతను ఆ సైనికులు స్వీకరించారు. ఆ సైనికులే స్వయంగా పెళ్లి కుమార్తె ఆరాధనను కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు. ఆమెను తమ సోదరిగా భావించి ఘనమైన వీడ్కోలు అందించారు. ఆమెకు అన్న లేని లోటును పూడ్చే ప్రయత్నంలో భాగంగా.. ఆ సైనికులు, మాజీ సైనికులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించిన పత్రాలను ప్రేమపూర్వక ఆశీర్వాదంగా అందజేశారు. పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత కూడా.. ఆ సైనికులు తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించారు. ఆరాధనను అత్తవారింటి వరకు సాగనంపి.. అన్నగా చేయాల్సిన చివరి బాధ్యతను భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. సైనికులు చూపిన ఈ అనూహ్య ప్రేమ కారణంగా.. పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరుడైన సైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన సైన్యం.. దేశభక్తికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.