Gaming Rules: డబ్బులతో కూడిన బెట్టింగ్ ఆన్‌లైన్ గేమ్స్‌లను భారత్‌లో నిషేధించారు. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. తాజాగా ఆన్‌లైన్ గేమింగ్స్‌కు సంబంధించిన నిబంధనలను నోటిఫై చేసింది కేంద్రం. గత సంవత్సరం పార్లమెంట్ ఆమోదం పొందిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్‌ను అమలు చేసేందుకు కావాల్సిన రూల్స్‌ను తాజాగా కేంద్రం నోటిఫై చేసింది. ఈ కొత్త గేమింగ్ నిబంధనలను మే 1, 2026 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఏ గేమ్ చట్టబద్ధమైనదో, ఏది చట్టబద్ధం కాదో నిర్ణయించే అధికారి ఈ గేమింగ్ అథారిటికీ ఉటుందని తెలిపింది. రియల్ మనీ గేములు కాకపోయినట్లయితే చాలా వరకు గేమ్స్‌కు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ సెక్రెటరీ ఎస్ కృష్ణన్ వెల్లడించారు. అయితే ఇ-స్పోర్ట్స్ గేమ్స్ మాత్రం చట్టంలో పేరొన్న ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్ మనీ గేమా లేదా సోషల్ గేమా, ఇ-స్పోర్ట్సా అని నిర్ధారించుకోవడం అనేది పూర్తిగా ఐచ్చికమని తెలిపారు. అథారిటీ ఏదైనా గేమ్స్‌ను సుమోటోగా చేపట్టడం, ఇ-స్పోర్ట్స్ గేమ్స్, నిర్దిష్ట సోషల్ గేమ్స్ ని కేంద్రం నోటిఫై చేసిన సందర్భాల్లో మాత్రం గుర్తింపును నిర్దారించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఎలా పని చేస్తుంది?దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆరుగురు అధికారులతో ఈ అథారిటీ పని చేయనుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ ఛైర్మన్ గా, ఎక్స్ అఫీషియోగా ఉంటారని కేంద్రం తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, సమాచార ప్రసారాల శాఖ సంయుక్త కార్యదర్శి, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి, న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఎక్స్ అఫీషియో సభ్యులగా ఉంటారని తెలిపింది.గతేడాది కేంద్రం పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చింది. ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు 2025ను కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లు సభ ఆమోదం అందుకుంది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ఆగడాలు పెరిగిపోవడంతో ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ గేమ్స్, ఈ-స్పోర్ట్స్‌ మధ్య స్పష్టమైన విభజన ఉండేలా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లులో పొందుపరిచిన రూల్స్ గేమింగ్ వేదికలు ఉల్లంఘిస్తే మూడేళ్లు జైలు, లేదా రూ.కోటి వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు.