తుస్సుమన్న అమెరికా దిగ్బంధనం.. రూ.8 వేల కోట్లపైగా విలువైన చమురుతో తప్పించుకున్న 34 ఇరాన్ ట్యాంకర్లు

Wait 5 sec.

పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, దిగ్బంధన వ్యూహం భారీ విజయం సాధించిందని, ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే వరకూ ఆంక్షలు ఎత్తివేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలన్నీ ఉత్తి ప్రగల్భాలేనా? అంటే అవునంటోంది ఓ నివేదిక. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌తో సంబంధం ఉన్న కనీసం 34 ట్యాంకర్లు అమెరికా దిగ్బంధనాన్ని దాటి వెళ్లాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి దశ శాంతి చర్చలు విఫలమై తర్వాత సంగతి తెలిసిందే. ఏప్రిల్ 13న ఇరాన్ పోర్టులు, ప్రాదేశిక జలాల్లో దిగ్బంధనం మొదలైంది. కానీ, ఇప్పటి వరకూ ఒమన్ తీరంలో ఆంక్షలున్న ఓ ట్యాంకర్‌ను మాత్రమే అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.దిగ్బంధనం మొదలైనప్పటి నుంచి అమెరికా దళాలు 28 నౌకలను వెనక్కి వెళ్లాలని లేదా ఓడరేవుకు తిరిగి రావాలని ఆదేశించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ మంగళవారం తెలిపింది. అయితే, నివేదిక ప్రకారం.. దిగ్బంధనాన్ని తప్పించుకున్న 34 నౌకలలో గల్ఫ్ నుండి బయటకు వెళ్లిన ఇరాన్‌కు చెందిన కనీసం 19 ట్యాంకర్లు ఉన్నాయి. మిగిలిన 15 నౌకలు అరేబియా సముద్రం నుంచి ఇరాన్ వైపుగా గల్ఫ్‌లోకి ప్రవేశించాయి.బయలుదేరిన నౌకలలో కనీసం ఆరు 10.7 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ క్రూడాయిల్ రవాణా చేస్తున్నాయని నిర్దారించింది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ చమురు సాధారణంగా బ్రెంట్ క్రూడ్ కంటే తక్కువ ధరకు అమ్ముడవుతుంది. కాబట్టి, మార్కెట్ ధర కంటే బ్యారెల్‌కు 10 డాలర్లు తక్కువని అంచనా వేసుకున్నా మొత్తం ఆదాయం సుమారుగా 910 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో రూ.8,435 కోట్లు) పైగా ఉంటుంది.. ఇరాన్ జెండా కలిగిన సూపర్‌ట్యాంకర్ ‘డోరెనా’ తన స్థానం, గుర్తింపును తెలియజేసే పరికరం ట్రాన్స్‌పాండర్‌ను ఆఫ్ చేసి, అమెరికా కంటబడకుండా తప్పించుకుంది. ప్రపంచవ్యాప్తంగా జలమార్గంలో జరిగే చమురు, గ్యాస్ సరఫరాపై రియల్ టైమ్ డేటా అందించే వోర్టెక్సా ప్రకారం.. సరుకుతో నిండిన ఈ నౌక ఏప్రిల్ 17న ఇరాన్ జలాలను దాటింది. ఆ తర్వాత ఏప్రిల్ 20న మరో రెండు చమురు ట్యాంకర్లు దీనిని అనుసరించాయి.ఆ తర్వాత, మలేషియా తీరంలో మరో నౌకలోకి డొరేనా 20 లక్షల బ్యారెళ్ల చమురు బదిలీ చేసింది. గతేడాది అమెరికా ఆంక్షలు విధించిన మురళికీషన్, అలిసియా వంటి ఇతర రైన ట్యాంకర్లు కూడా ఒమన్ తీరం నుంచి గల్ఫ్‌లోకి ప్రవేశించాయి. ఈ రెండు నౌకలు ఏప్రిల్ 14న హర్ముజ్ జలసంధిని దాటి గల్ఫ్ ఉత్తర తీరానికి ప్రయాణించాయి. కానీ, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుండగా.. హర్ముజ్ జలసంధి తిరిగి తమ నియంత్రణలోకి వచ్చిందని ఏప్రిల్ 18న ఇరాన్ ప్రకటించింది.హర్మూజ్‌లో ప్రయాణించే అన్ని నౌకలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ నుంచి అనుమతి అవసరమని ఇరాన్ స్పష్టం చేసింది. పౌర నౌకలు తాము నిర్దేశించిన మార్గం ద్వారా మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉందని, సైనిక నౌకలకు మాత్రం ఇప్పటికీ అనుమతి లేదని ఇరాన్ నౌకాదళం తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ విధానం ఉందని వెల్లడించింది.వ్యూహాత్మక జల సంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ శనివారం ప్రకటించినప్పటికీ, నౌకలు వెళ్లడానికి అనుమతి అవసరమని తరువాత స్పష్టం చేయడంతో కనీసం 30 నౌకలు దాని గుండా ప్రయాణానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ కంటెయినర్, భారతీయ ట్యాంకర్‌పై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.