తెలంగాణలోని నిరు పేదలకు సొంత గూడు కల్పించటమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన , భూ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన భూ భారతి అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి యుద్ధప్రాతిపదికన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన రెవెన్యూ, గృహనిర్మాణ సమస్యలకు పరిష్కారం కనుగొంటామని ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఈ ప్రత్యేక భేటీలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం నిజామాబాద్, మధ్యాహ్నం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల సమీక్షలు హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.ముఖ్యంగా అసంపూర్తిగా ఆగిపోయిన సుమారు 35,200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టతకు రానుంది. ఎవరికీ కేటాయించని ఈ ఇళ్లను ఇందిరమ్మ పథకం మొదటి విడతలోని ఎల్-2 జాబితాలోని లబ్ధిదారులకు అందజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల వృథాగా ఉన్న ఇళ్లు వినియోగంలోకి రావడమే కాకుండా, పేదలకు తక్షణమే ఆశ్రయం లభిస్తుంది. అదేవిధంగా, ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 3.25 లక్షల ఇళ్లకు అనుమతులు ఇవ్వగా.. 2.66 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన బిల్లుల చెల్లింపులను తక్షణమే క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.మరోవైపు రెవెన్యూ శాఖకు సంబంధించి తొమ్మిది లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూర్చే సాదాబైనామాల క్రమబద్ధీకరణపై ఈ సమీక్షల్లో కీలక చర్చ జరగనుంది. ధరణి, ఇతర భూ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు భరోసా కల్పించేలా భూ భారతి కార్యక్రమాన్ని పటిష్టం చేయనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారు అనర్హుల జాబితా ఎల్-3లోకి వెళ్లడంపై వచ్చిన ఫిర్యాదులను రీ-వెరిఫికేషన్ చేయాలని మంత్రి నిర్ణయించారు. జూన్ మొదటి వారానికల్లా లక్ష ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. ఈ సమీక్షల ద్వారా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించనుంది. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ప్రజాప్రతినిధుల సూచనలే ప్రాతిపదికగా ఈ పరిష్కార మార్గాలు ఉండనున్నాయి.