సమ్మర్ ఎఫెక్ట్.. తెలంగాణలో రికార్డు స్థాయికి బీర్ల విక్రయాలు, మంచి నీళ్లలా తాగేస్తున్నారు..!

Wait 5 sec.

తెలంగాణలో భానుడు భగ్గమంటున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండలతో ప్రజలు కూల్‌డ్రింక్స్, చెరుకు రసం, ఐస్‌క్రీమ్స్ వంటి వాటి వైపు మెుగ్గుచూపుతున్నారు. ఇక మందు బాబులు మాత్రం మండే ఎండల్లో రిలీఫ్ కోసం చల్లని చిల్డ్ బీర్లు కుమ్మేస్తున్నారు. మంచి నీళ్ల ప్రాయంలా బీర్లు తాగేస్తున్నారు. మార్చి నెలలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఎక్సైజ్ శాఖకు కిక్కిచ్చాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మందుబాబులు ఎక్కువగా బీర్ల వైపు మొగ్గు చూపడంతో.. మార్చి నెలలో బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది మార్చిలో 39.05 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా.. ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 30 శాతం వృద్ధి చెంది 50.78 లక్షల కేసులకు చేరుకుంది. బీర్ల ధరలు గతంతో పోలిస్తే పెరిగినప్పటికీ.. ఎండల వేడిని తట్టుకునేందుకు చాలా మంది బీర్ల తాగేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో మద్యం సేల్స్ భారీగా పెరిగాయి. మరోవైపు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) విభాగంలో విక్రయాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది మార్చిలో 31.46 లక్షల కేసులు అమ్ముడవగా.. ఈసారి 30.67 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే సుమారు 2.5 శాతం తగ్గుదల నమోదైంది. విక్రయాల పరిమాణంలో మార్పులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. గత ఏడాది మార్చిలో రూ. 3,126 కోట్లుగా ఉన్న మద్యం విక్రయాల విలువ.. ఈ ఏడాది 11.49 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ. 3,485 కోట్లకు చేరింది.ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న మద్యం విక్రయాలు ఆకాశాన్ని తాకాయి. గతేడాది అదే రోజున కేవలం రూ. 63.86 కోట్ల విక్రయాలు జరగగా.. ఈ ఏడాది ఏకంగా రూ. 410.87 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇది గతేడాదితో పోలిస్తే అసాధారణంగా 543.3 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఆ ఒక్క రోజే 3.66 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్, 4.38 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో వేసవి ముందుగానే రావటం, నిప్పులు కురిపించే ఎండల వల్ల ప్రజలు ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ కంటే బీర్లకే ప్రాధాన్యత ఇవ్వడం ఈ మార్పుకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు.