'ఇది మన హైదరాబాదేనా?'.. సైకిల్ ట్రాక్‌పై యువతికి చేదు అనుభవం.. వీడియో వైరల్

Wait 5 sec.

మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం మరోసారి చర్చనీయాంశమైంది. ఐటీ కారిడార్‌లోని గండిపేట పరిసరాల్లో ఉన్న ప్రతిష్ఠాత్మక సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఉదయం రన్నింగ్‌కు వెళ్లిన ఓ యువతికి ఓ వ్యక్తి నుండి వికృత వేధింపులు ఎదురయ్యాయి. ఉదయం 6:15 గంటల సమయంలో.. ట్రాక్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆమెను చూస్తూ అత్యంత అసభ్యకరంగా (హస్త ప్రయోగం చేస్తూ) ప్రవర్తించాడని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. సూర్యోదయం తర్వాత.. జనం తిరుగుతున్న సమయంలోనే ఇలాంటి దారుణం జరగటం నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది. తన సెల్ ఫోన్ కెమెరా ఓపెన్ చేసేలోపే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడని.. లేదంటే వాడి ముఖాన్ని ప్రపంచానికి చూపించేదాన్నని ఆమె ఆ వీడియోలో వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి షేర్ చేసిన వీడియోలో పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. 'రన్నింగ్ చేసేటప్పుడు రన్నింగ్ దుస్తులు కాక ఇంకేం వేసుకోవాలి? సూర్యోదయం అయ్యాకే.. ఆరు తర్వాతే బయటకు వస్తున్నాను.. అయినా సరే భద్రత లేకపోతే ఎలా?' అని ఆమె ప్రశ్నించింది. కనీసం ఆటోలు, బైక్‌లపై వెళ్తున్నప్పుడు కూడా కొందరు వ్యక్తులు.. ముఖ్యంగా పెద్ద వయసు వారు సైతం అసభ్యంగా చూస్తున్నారని ఇది మహిళలకు ఏమాత్రం సురక్షితమైన వాతావరణం కాదని ఆమె వాపోయింది. 'అసలు ఇది మనం చెప్పుకునే సురక్షితమైన హైదరాబాదేనా?' అంటూ ఆమె అడిగిన ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, పెట్రోలింగ్ వాహనాల నిఘా ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఐటీ కారిడార్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా పెంచాలని, ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల బదిలీలు, రాజకీయ పరిణామాల మధ్య సామాన్య మహిళల భద్రతను విస్మరిస్తున్నారా? అంటూ ఎక్స్ వేదికగా పోలీసులను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి నిందితుడిని త్వరగా పట్టుకోవాలని బాధితురాలితో పాటు నెటిజన్లు కోరుతున్నారు.